ప్రియుడి కిరాతకం.. తనకు దక్కనిది మరొకరికి దక్కొదని యువకుడి హత్య!

పెళ్లితో కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలనుకున్నాడు ఆ యువకుడు. కానీ, ప్రేమోన్మాదం విషం చిమ్మింది. నాకు దక్కనిది ఎవరికీ దక్కకూడదనే అక్కసు ఆ యువకుడి నిండు ప్రాణాలను బలిగొన్నది. తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకుంటున్నాడనే కక్షతో యువకుడిని హత్య చేసిన ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. గత నాలుగేళ్లుగా హరీశ్‌రెడ్డి, ఓ యువతి ప్రేమించుకుంటున్నారు. ఇరువురి స్వస్థలం హుస్నాబాద్. విషయం ఇంట్లో తెలియగా కులాలు వేరు కావడంతో హరీశ్‌రెడ్డి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో తమ కుమార్తెకు వివాహం చేయాలని నిర్ణయించుకుని క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్‌తో పెళ్లి నిశ్చయించారు. విషయం తెలుసుకున్న హరీశ్‌రెడ్డి తాను ప్రేమించిన యువతిని మరో వ్యక్తి పెళ్లి చేసుకోవడం సహించలేకపోయాడు. ఎలాగైనా రాజశేఖర్‌ను మట్టుబెట్టాలని ప్లాన్ వేశాడు.

తాను ప్రేమించిన యువతిని నుంచి హరీశ్‌రెడ్డి క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్‌ ఫోన్ నంబర్‌ను సేకరించాడు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు వెళ్లాలని ఫోన్ చేసి క్యాబ్ బుక్ చేశాడు. ఈ మేరకు గత నెల 29న రాజశేఖర్ తన కారులో కొహెడ మండలం ఆరెపల్లికి వచ్చాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం స్నేహితుడు నాగరాజుతో కలిసి హరీశ్‌రెడ్డి కారు ఎక్కాడు. తమ వెంట కత్తులు, సర్జికల్ మాస్కులు, గ్లౌసులు తెచ్చుకున్నారు. మార్గం మధ్యలో హత్య చేయాలని భావించినా వీలు కాకపోవడంతో మరికొందరిని ఎక్కించుకోలని బుద్ధిపడగ వైపు వెళ్లాలని సూచించారు. బుద్ధిపడగ శివారులో టాయిలెట్ కోసమని చెప్పి, కారును నిలిపివేయించి రాజశేఖర్‌‌ను దారుణంగా హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. రాజశేఖర్‌కు వచ్చిన ఫోన్‌కాల్స్ ఆధారంగా హరీశ్‌రెడ్డి, నాగరాజు, అతనికి సహకరించిన శివను మంగళవారం అరెస్టు చేశారు.