పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుందో లేదో తెలియదు కానీ… నాశనం అయిపోతున్న స్త్రీ బ్రతుకు వెనుక మాత్రం పురుషుడు ఉంటున్నాడు!… పేరు ఏదైనా, వయసు ఎంతైనా .. మృగాడి చేతిలో బలైపోతున్న మహిళల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. మత్తు చాటునో, మదమెక్కిన మస్తిష్కం వల్లనో మృగాడి వికృతచేష్టల మాటున స్త్రీ బలైపోతుంది.
2020 నేషనల్ క్రైం బ్యూరో నివేదిక ప్రకారం… మహిళలపై జరిగిన లైంగిక వేదింపుల కేసులు 4907 గా ఉండగా… చిన్నారులపై లైంగిక దాడులు, ఫోక్సో కేసుల సంఖ్య 2074గా ఉంది. ఇక మహిళలపై దాడుల సంఖ్య 2520 గా ఉండగా… విశ్వనగరం భాగ్యనగరంలో రేప్ కేసులు 92 గా నమోదయ్యాయి. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే… వెలుగులోకి వచ్చినవి మాత్రమే! ఇంకా వెలుగులోకి రానివి, బయటప్రపంచానికి కనిపించనివి ఎన్నో మరెన్నో…!
అమ్మాయిల అలంకరణ, ధరించే వస్త్రాల వల్లే అఘాయిత్యాలు జరుగుతున్నాయనే సన్నాసి మేధావుల్లారా..? సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల వయసున్న పాపపై జరిగిన అఘాయిత్యానికి కారణం?? ఏం తప్పుచేసిందా పాప, ఏ విధంగా రెచ్చగొట్టింది.?? ఆలోచించండి..
మారాలి… పాలకులు మారాలి, పోలీసు వ్యవస్థ మారాలి, చట్టాలు మారాలి – ఆ చట్టాలలోని శిక్షలు మారాలి, పిల్లలను పెంచే విధానం మారాలి, మహిళలపై గౌరవాలు పెరగాలి, అంతకంటే ముందు మనిషి మారాలి.. మగాడు అనేవాడు మారాలి, మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలి!