ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రాష్ట్రపతి ఎన్నికలకు నిన్న పోలింగ్ జరిగింది. అయితే పోలింగ్ ఎక్కువ శాతం క్రాస్ ఓటింగ్ జరిగినట్లుల తెలుస్తోంది. ఝార్ఖండ్, గుజరాత్‌కు చెందిన ఎన్సీపీ ఎమ్మెల్యేలు ముర్ముకు అనుకూలంగా ఓటు వేశామని వెల్లడించగా.. హరియాణా, ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ ఆత్మ ప్రబోధానుసారం ముర్ముకు మద్దతుగా నిలిచామని వెల్లడించారు.. పంజాబ్‌లో అకాలీదళ్ ఎమ్మెల్యే రాష్ట్రపతి ఎన్నికలను బహిష్కరించగా, అసోంలో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముర్ముకు ఓటు వేశారని ఐయూడీఎఫ్ ఎమ్మెల్యే కరీముద్దీన్ బర్భూయాన్ తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ తన మనస్సాక్షి ప్రకారమే ఓటు వేశానని హరియాణా కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో శివపాల్ సింగ్ యాదవ్… సమాజ్‌వాదీ పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి ముర్ముకు మద్దతుగా ఉన్నట్లు ప్రకటించారు. ముర్ము ఒడిశా కుమార్తె అని.. అందుకే ఆమెకు అనుకూలంగా ఓటు వేశానని ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యే మహమ్మద్ మొక్విమ్ ప్రకటించడం కలకలం సృష్టించింది.
ఝార్ఖండ్‌లో ఎన్సీపీ ఎమ్మెల్యే కమలేష్ సింగ్ ద్రౌపది ముర్ముకు ఓటు వేసినట్లు తెలిపారు. ఝార్ఖండ్‌లో ద్రౌపది ముర్ముకు అనుకూలంగా చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటు వేశారని భాజపా ఎమ్మెల్యే బిరంచి నారాయణ్ ప్రకటించారు. గుజరాత్‌లో ఎన్సీపీ ఎమ్మెల్యే కంధాల్ జడేజా ముర్ముకు అనుకూలంగా ఓటు వేసినట్లు తెలిపారు.వైకాపా, తెదేపా, బిజద, బీఎస్పీ, జేడీఎస్, శిరోమణి అకాలీదళ్ వంటి ప్రాంతీయ పార్టీలు ముర్ముకు సంపూర్ణ మద్దతు ప్రకటించడం మరికొన్ని రాష్ట్రాల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరగడంతో ముర్ముకు ఓట్ల శాతం…. భారీగా పెరిగే అవకాశం ఉందన్న విశ్లేషణలున్నాయి. మొత్తం 10,86,431 ఓట్లలో ముర్ముకు అనుకూలంగా ఏడు లక్షలకు పైగా ఓట్లు వస్తాయని భాజాపా భావిస్తోంది. 2017లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 10,69,358 ఓట్లకు గాను… రామ్‌నాథ్ కోవింద్‌కు 7 లక్షల 2 వేల 44 ఓట్లు రాగా….. మీరా కుమార్‌కు 3,67,314 ఓట్లు వచ్చాయి.