ఉత్తరాంధ్రకు హై అలెర్ట్… అధికారులతో సీఎం సమీక్ష..

ఏపీకి మరోమారు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. వరసగా అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫానులు ఏపీ వాసులను భయపెడుతున్నాయి. ఇప్పటికేఅల్పపీడన ప్రభావంతో రాయసీమ జిల్లాలు చాలా నష్టపోయాయి. ప్రస్తుతం మరో తుఫాను ఉత్తరాంధ్రవాసులకు కంటిమీద కనుకు లేకుండా చేస్తుంది. అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటల్లో తుఫానుగా ఏర్పడే అవకాశం ఉండటంతో ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. తుఫాను ఉత్తరాంధ్ర…ఒడిశా సరిహద్దుల్లో తీరం దాాటే అవకాశం ఉండటంతో  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఉత్తరాంధ్రకు తుపాను హెచ్చరికల దృష్ట్యా ఆయా జిల్లాల కలెక్టర్లు, సీఎంఓ అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైనచోట సహాయ శిబిరాలు తెరిచేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకోవాలని నిర్దేశించారు. లోతట్టు, ముంపు ప్రాంతాలు ఉంటే అప్రమత్తంగా ఉండాలన్నారు. తుపాను కారణంగా ఉత్పన్నమయ్యే పరిస్థితుల వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూడాలని సీఎం ఆదేశించారు.  తుపాన్‌ సహాయ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతను ముగ్గురు సీనియర్‌ అధికారులకు సీఎం జగన్​ అప్పగించారు. శ్రీకాకుళం జిల్లాకు హెచ్‌. అరుణ్‌కుమార్, విజయనగరం జిల్లాకు కాంతిలాల్‌దండే, విశాఖ జిల్లాకు శ్యామలరావును నియమించారు.