హైదరాబాద్: వాసాలమర్రిలో దళిత బంధు అమలుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. మొత్తం 7 కోట్ల 60 లక్షల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. యాదాద్రి జిల్లా కలెక్టర్ ఈ దళిత బంధు నిధులను విడుదల చేశారు. 76 మంది దళిత కుటుంబాలకు ఈ నిధులను ఇవ్వనున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున లబ్దిదారులను అందించనున్నారు. దీంతో వాసాలమర్రిలో పండగవాతావరణం నెలకొంది. సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. దళిత బంధువు కేసీఆర్ అని హర్షం వ్యక్తం చేశారు.
కాగా సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ఉపఎన్నిక ప్లాన్ అమలు చేస్తున్నారు. త్వరలో ఉపఎన్నిక నోటిఫికేషన్ వస్తుందన్న నేపథ్యంలో తొలుత వాసాలమర్రి గ్రామంలో తన మార్క్ చూపించారు. దళితబంధును అమలు చేసి దళిత సాధికారిత తమ ప్రభుత్వంతోనే సాధ్యమని నిరూపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నెల 16న హుజూరాబాద్‌లో కూడా ఈ పథకాన్ని అమలు చేసి ఉపఎన్నికలో మెజార్టీ ఓట్లు దక్కించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా వాసాలమర్రిలో దళితబంధు నిధులు విడుదల చేశారు.