ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కన్నుమూత..

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆమె తీవ్రమైన గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అయినప్పటికీ అస్వస్థత ఎక్కువ కావడంతో ఆమె మృతి చెందారు.

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆమె తీవ్రమైన గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అయినప్పటికీ అస్వస్థత ఎక్కువ కావడంతో ఆమె ఇవాళ మృతి చెందారు. కాగా షీలా దీక్షిత్ వయస్సు 81 సంవత్సరాలు. ఆమె 1998 నుంచి 2013 వరకు 15 ఏళ్ల పాటు ఢిల్లీ సీఎంగా సేవలందించారు. 2014 మార్చి నుంచి 2014 ఆగస్టు వరకు కేరళ రాష్ర్టానికి ఆమె గవర్నర్‌గా కూడా పనిచేశారు.

షీలా దీక్షిత్ 1938 మార్చి 31వ తేదీన పంజాబ్‌లోని కపుర్తాలలో జన్మించారు. ఆమె రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీలోనే ప్రారంభమైంది. ఆమె ప్రస్తుతం ఢిల్లీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆమె ఈశాన్య ఢిల్లీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆమె మొదటి సారిగా యూపీలోని కన్నౌజ్ నుంచి లోక్‌సభ (1984-1989) ఎంపీగా గెలుపొందారు. ఆ తరువాత 1986 నుంచి 1989 వరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు.

షీలా దీక్షిత్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు స్పందించారు. ఆమె పార్టీకి, ప్రజలకు అందించిన సేవలను మరువలేమన్నారు. షీలా దీక్షిత్ లాంటి నాయకురాలిని కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.