రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానం (ఐసీసీ), ఉక్రెయిన్ లో ఆక్రమించుకున్న ప్రాంతాల నుంచి చిన్న పిల్లలను బలవంతంగా రష్యా తరలించారన్న ఆరోపణలతో అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితుడు, భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్ దిమిత్రి మెద్వెదేవ్ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో తీవ్ర పరిణామాలుంటాయన్నారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ అణుశక్తి అధ్యక్షుడిని విచారించాలని నిర్ణయించిందని, అయితే, కోర్టులోని న్యాయమూర్తులు ప్రధాన అణుశక్తికి వ్యతిరేకంగా వ్యవహరించొద్దని వెల్లడించారు మెద్వెదేవ్.
హేగ్‌లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుపై క్షిపణి పడవచ్చన్న మెద్వెదేవ్.. అంతర్జాతీయ కోర్టు న్యాయమూర్తులు ఆకాశం వైపు ఓ కన్నేసి ఉంచాలని అన్నారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు రష్యా అధ్యక్షుడిపై వారెంట్‌ను జారీ చేసింది. అయితే, ఈ అరెస్ట్ వారెంట్‌పై రష్యా ప్రభుత్వం ఐసీసీ అధికార పరిధిని అంగీకరించేది లేదని స్పష్టంగా చెప్పింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడంతో వేలాది మంది పిల్లలు వలస వెళ్లిన విషయం తెలిసిందే. మరో వైపు పుతిన్‌పై అరెస్టు వారెంట్ జారీ చేయడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా సమర్థించారు.