ఏపీలో కరోనా వ్యాప్తి అత్యధికంగా కొనసాగుతోంది. రోజురోజుకి కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇప్పటికే ఎంతో మంది ప్రజాప్రతినిధులు, అధికారులు దీని బారిన పడ్డారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి నివాసం వద్ద ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి, నారాయణ స్వామి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు చేయించగా వారికి నెగెటివ్‌గా తేలింది.
కరోనా సోకిన కానిస్టేబుళ్లు చిత్తూరు, తిరుపతి రెడ్ జోన్‌లలో విధులు నిర్వహించినందున వైరస్ సోకిందని అధికారులు తెలిపారు. అదేవిధంగా సీఎం కార్యాలయంలో పని చేసే ఐఏఎస్ అధికారికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 12,285కు చేరింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన మొదలైంది. అలాగే ప్రజాప్రతినిధుల్లో కూడా కలవరం మొదలైందని తెలుస్తుంది.