మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటివరకు జరిగిన కీలక పరిణామాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. 2019 మార్చి 15న వైయస్ వివేకానంద రెడ్డి హత్య జరిగింది. అదే రోజు అడిషనల్ డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. మార్చి 28న వివేకా పీఏతో పాటుగా ముగ్గురిని అరెస్ట్ చేశారు. జూన్ 13న ఎస్పీ స్థాయి అధికారికి సిట్ బాధ్యతలు అప్పగించారు.
ఇక సెప్టెంబర్ 2న కేసులో సాక్షిగా ఉన్న శ్రీనివాసరెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందారు. 2020 ఫిబ్రవరి 7న సీబీఐ విచారణ కోరుతూ వేసిన పిటీషన్ ఉపసంహరించుకున్నారు జగన్. మార్చి 3న వైఎస్ భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. ఇక ఈ కేసుని మార్చి 11న సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో 2021 ఆగష్ట్ 3 సునీల్ యాదవ్ ని అరెస్ట్ చేశారు. ఆగస్ట్ 31న అఫ్రూవర్ గా మారిన దస్తగిరి కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ముందు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో సెప్టెంబర్ 9 గజ్జల ఉమాశంకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు.
అలాగే నవంబర్ 18న వైఎస్సార్సీపీ కార్యదర్శి శంకర్రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇక 2022 జూన్ 9న గంగాధర్ రెడ్డి అనే మరో సాక్షి మృతి చెందాడు. దీంతో నవంబర్ 22న ఈ కేసుని కడప కోర్టు నుంచి హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక 2023 జనవరి 28న హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో అవినాష్ రెడ్డిని విచారించారు సిబిఐ అధికారులు. ఫిబ్రవరి 3న కడపలో జగన్ ఓఎస్డీ తో పాటుగా భారతి అనుచరుడు నవీన్ ని విచారించారు. ఇక ఫిబ్రవరి 23న విచారణకు హాజరుకావాలని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు.