ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అయితే తాజాగా పోలవరం అంశంలో మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రస్తుత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించుకోవడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటనను సీఎం జగన్ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు దేవినేని ఉమ. కేసీఆర్ నుంచి గత ఎన్నికల కోసం నిధులు తెచ్చుకున్నందువల్లే జగన్ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారని ఆరోపించారు దేవినేని ఉమ.
కాగా, పోలవరం నిర్వాసితులకు అందాల్సిన డబ్బు అందలేదని, ఆ డబ్బును ప్రభుత్వ పెద్దలు మింగేశారన్న దేవినేని ఉమ.. ఈ అంశంలో జగన్ జైలుకెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ స్కాంలో పోలవరం, రంపచోడవరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అనంతబాబు పాత్ర ఉందని అన్నారు. అంతేకాకుండా పోలవరంపై చర్చలకు సిద్ధమంటూ ఆయన సవాల్ విసిరారు.