ఏపీ ప్రభుత్వంపై, ప్రభుత్వ పథకాలపైన, మంత్రులపైన, సీఎం పైన ఎలాంటి అసత్య ప్రచారాలు చేసినా వారి వెంట సీఐడీ అధికారులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి దేవినేని ఉమ వర్సెస్ సీఐడీలా మారింది పరిస్థితి. సీఐడీ నుంచి దేవినేని ఉమకు వరుస ఫోన్లు వస్తున్నాయి. ఫేక్ ట్వీటు విషయమై మంత్రి అంబటిపై చేసిన ఫిర్యాదు అంశంలో ఉమ స్టేట్మెంట్ రికార్డు చేసుకునేందుకు సీఐడీ ఫోన్లు చేస్తోంది. వరుసగా రెండు రోజుల నుంచి ఫోన్లు చేస్తుండడంపై దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడైన అంబటిని కాకుండా.. తన వెంట పడడమేంటంటూ ఫోన్లో దేవునేని ఉమ మండిపడ్డారు. ప్రభుత్వాన్ని, సీఎంను, సజ్జలను విమర్శిస్తున్నానని సీఐడీ ఛీఫ్ కు నాపై ప్రేమ వచ్చిందా..? అంటూ సీఐడీ పోలీసులను దేవినేని ఉమ ప్రశ్నించారు.
దోషులను పట్టుకోకుండా.. సీఐడీ ఛీఫ్ కు తనపై కోపమెందుకు వచ్చిందంటూ ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జలను ప్రశ్నించినందుకా..? లేక లండన్ మందుల గురించి లేవనెత్తినందుకా..? అంటూ ఎద్దేవా చేశారు. తాను ఫిర్యాదు చేస్తే.. ఇంకా స్టేట్మెంట్ ఏంటని, దొంగని పట్టుకోకుండా తన వెంట పడతారేంటంటూ అంబటిని ఉద్దేశిస్తూ సీఐడీ పోలీసులపై నిప్పులు చెరిగారు దేవినేని. నేనేం భయపడనని రాజమండ్రి వెళ్లేందుకు నేనూ ప్రిపేర్ అవుతున్నానని స్పష్టం చేసిన దేవినేని ఉమ.. ఇప్పటికైనా సీఐడీ తన ఫిర్యాదుపై అంబటిని అరెస్ట్ చేయాలన్నారు.