చంద్రబాబు పర్యటన సందర్భంగా ఇటీవల అంగళ్లు, పుంగనూరులలో రేకెత్తిన ఘర్షణల్లో వందలాదిమంది టిడిపి కార్యకర్తలు, నాయకులపై కేసులు నమోదయ్యాయి. చంద్రబాబుపైనా హత్యాయత్నం కేసు నమోదైంది. ఇప్పటి వరకు 12 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. 317 మందిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు 81 మందిని అరెస్ట్ చేశారు. అయితే.. పుంగనూరులో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుంగనూరులో పోలీసులపై అల్లరి మూకలు దాడులకు పాల్పడ్డాయని, ఇలాంటి దాడులను పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు.
ఎవరైనా సరే… శాంతిభద్రతలను దెబ్బతీసే విధంగా ప్రకటనలు చేసినా, పోలీసులపై దాడి చేసినా తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, పుంగనూరులో పోలీసులపై దాడి చేసిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, పుంగనూరు దాడి ఘటనలో పాల్గొంది బయటి వ్యక్తులా? స్థానికులా? అనే దానిపై నిశితంగా విచారణ జరుపుతున్నట్టు డీజీపీ వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటివరకు 80 మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. పోలీసు డిపార్ట్ మెంట్ అందరి కోసం పనిచేస్తుందన్న విషయాన్ని రాజకీయ పార్టీలు గ్రహించాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజకీయ పార్టీలు తమకు సహకరించాలని అన్నారు.