ధారావిపై డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసలు..!

ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ముంబైలోని ధారావిలో మహమ్మారి కరోనా వ్యాప్తిని కట్టడి చేసిన తీరును డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసించింది. సరైన జాగ్రత్తలు పాటిస్తే ప్రాణాంతక వైరస్‌పై విజయం సాధించగలమని ధారావి నిరూపించిందని కొనియాడింది. వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు చేసిన ప్రయత్నాల కారణంగా నేడు కరోనా మహమ్మారి బారి నుంచి ధారావి బయటపడిందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ పేర్కొన్నారు.

వైరస్ ఎంతగా వ్యాప్తి చెందినప్పటికీ నియంత్రించగలమని ఇటలీ, స్పెయిన్, దక్షిణ కొరియా, ధారావి నిరూపించాయని అన్నారు. కేవలం 2.1 చదరపు కి.మీ పరిధిలో 10లక్షల పైచిలుకు జనాభా ఉండే ఈ ప్రాంతంలో మొదట్లో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. అయితే ముంబై పురపాలక సంస్థ(బీఎంసీ) తగిన చర్యలు తీసుకోవడంతో కేసుల సంఖ్య క్రమంగా తగ్గింది. కరోనా నిర్ధారణ పరీక్షల నిర్వహణ, వైరస్‌ బారిన పడిన వారికి తక్షణ చికిత్స, ఐసోలేషన్‌ నిబంధనల అమలు వైరస్‌ గొలుసును బ్రేక్‌ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంది.