విశాఖ తీరానికి కొట్టుకు వచ్చిన బంగ్లాదేశ్ నౌకను తరలించేందుకు అనుకూలమైన అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు అధికారులు. షిప్ ఆపరేషన్ కోసం మెరైన్ ఎక్స్ పర్ట్ ధర్మాడి సత్యం బృందం రంగంలోకి దిగింది. రాళ్లల్లో కూరుకుపోయిన ఓడలోని చమురు నిల్వలు ఖాళీ చేసేందుకు ట్యాంకులు తెన్నేటి పార్క్ తీరానికి చేరుకున్నాయి.
బంగ్లాదేశ్ వాణిజ్య నౌక ఎం.వి.మాను తరలించడం ఆషామాషీ వ్యవహారం కాదని తెలుస్తోంది. తీవ్ర వాయుగుండం సమయంలో వీచిన గాలులకు తెన్నేటి పార్కు తీరానికి కొట్టుకువచ్చింది ఈ నౌక. సుమారు 3 వేల టన్నుల బరువు కలిగిన ఈ నౌక గత నెల 19న విశాఖ రేవుకు చేరుకుంది. ఒకటి రెండు రోజుల్లో క్వార్ట్ జైట్ లోడ్ తరలించేందుకు సిద్ధం అవుతుండగా ఔటర్ హార్బర్లో వేచి చూస్తున్న సమయంలో బలమైన గాలులు వీచాయి. యాంకర్ తెగిపోవడంతో నడి సముద్రం నుంచి ఒడ్డుకు 20నిముషాల వ్యవధిలో కొట్టుకు వచ్చినట్టు గుర్తించారు.
నౌకలో సిబ్బంది క్షేమంగా ఉండడం, ఇంధనానికి ఎటువంటి నష్టం వాటిల్లకపోవడం వల్ల ప్రమాదకర పరిస్థితులు లేవని ఒక అంచనాకు వచ్చారు. కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం…షిప్ కొట్టుకు వచ్చిన ప్రాంతానికి చేరుకుంది. నౌక తరలింపునకు తీసుకోవాల్సి న చర్యలపై నివేదికను సిద్ధం చేస్తోంది. ఎంవీ మాలో 40 టన్నుల ఇంధనం ఉంది. బంగ్లాదేశ్ నుంచి విశాఖపట్నం రావడానికి, తిరిగి ఇక్కడి నుంచి సరకుతో వెళ్లడానికి అవసరమైన ఆయిల్ నింపుకొని నౌక ఇక్కడికి వచ్చింది.