హోదాకు సంబంధించి కేంద్రం ఉన్నట్టుండి ఓ ప్రకటన చేసి అంతలోనే విరమించుకుంది.దీంతో ఆంధ్రుల ఆశలు అడియాశలు అయ్యాయి.అంతా భావించినవిధంగా హోదా వస్తుందని అనుకున్నాక ఆఖరి నిమిషంలో ట్విస్టు పెట్టింది కేంద్రం.దీంతో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారిపోయాయి. మరోవైపు వైసీపీ మాత్రం టీడీపీనే ఇదంతా చేసిందని, బాబు రాజకీయం ఫలించిన కారణంగానే హోదా రాకుండా పోయిందని, ఈ విషయమై ఈనెల 17న కేంద్రం నియమించిన త్రి సభ్య కమిటీతో చర్చలు జరపకుండా చేసేందుకు టీడీపీ కుట్ర పన్నిందని అంటోంది. ఏదేమయినప్పటికీ ఇప్పటికిప్పుడు ఆంధ్రాకు హోదా రాదు అనే తేలిపోయింది.దీనిపై ఎవ్వరు ఎన్ని చెప్పినా అవన్నీ ఆచరణ సాధ్యం కావు.
అప్పులు తిప్పలు వాస్తవానికి ఆంధ్రాకు తెలంగాణకు మధ్య విభజన అంశాలు చాలా అపరిష్కృతంగానే ఉన్నాయి.ఇందులో రాష్ట్రం విడిపోయాక తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ బిల్లులకు సంబంధించి ఆంధ్రాకు కోట్లలో చెల్లించాల్సినవి ఉన్నాయి. కానీ ఈ బకాయిల విషయమై ఎక్కడా ఎవ్వరూ మాట్లాడడం లేదు.అదేవిధంగా ఆస్తుల విభజన ప్రక్రియ పూర్తికాలేదు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ను ఇంకా విడదీయలేదు. దీని ప్రకారం ఎవరి ఆస్తులు ఎంత ఎవరి అప్పులు ఎంత అన్నది తేలనుంది.ఇదే ఇప్పుడు అంటే ఫిబ్రవరి 17న ప్రధాన చర్చకు రానుంది.
దీని ఆధారంగానే మిగతా విషయాలు కూడా తేలనున్నాయి. ఇక హైద్రాబాద్ లో ఉన్నా చాలా ఆస్తులు ఆంధ్రాకు చెంది ఉన్నాయి. వాటిలో కొన్ని చంద్రబాబు, ఇంకొన్ని జగన్ అయాచితంగానే తెలంగాణకు వదిలేసి వచ్చారన్న ఆరోపణలు మరియు విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి రాష్ట్రం విడిపోయాక రెండు పార్టీలూ (ఆంధ్రాకు చెందిన రెండు పార్టీలూ) కేసీఆర్ తో సఖ్యంగానే ఉన్నాయి కానీ ఆస్తుల విషయమై ఆంధ్రాకు దక్కాల్సిన వాటాపై మాత్రం పట్టుబట్టలేకపోయాయి.ఇదే టీడీపీ మరియు వైసీపీ తప్పిదం. ఆ విధంగా చూస్తే తెలంగాణాదే పై చేయి అయింది.కానుంది కూడా! కేంద్రం దయతలిస్తే నిధులు తెచ్చుకోవడం తప్ప ఆంధ్రా నాయకులు ఇవాళ పోరుబాట పట్టి నడుస్తున్నది, సాధిస్తున్నది ఏమీ లేదు అన్నది వివాద రహిత విషయం.
– రత్నకిశోర్ శంభుమహంతి