ఏపీ ఉద్యోగులకు సిఎం జగన్ మోహన్ రెడ్డి అదిరిపోయే శుభవార్త చెప్పారు. సొంత ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధి చేస్తున్న జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్‌లో.. ఎంఐజీ లే అవుట్స్‌లోని ప్లాట్ల లో 10 శాతం ప్లాట్లను రిజర్వ్‌చేయడమే కాకుండా 20 శాతం డిస్కౌంట్ ను ఇవ్వాలని నిర్ణయించామని సిఎం జగన్ కీలక ప్రకటన చేశారు.
నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటామని… ఉద్యోగులు ఎవ్వరికీ కూడా ఇంటి స్థలం లేదనే మాట లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు సిఎం జగన్. ఆ రిబేటును కూడా ప్రభుత్వం భరిస్తుందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ జూన్ 30 లోగా ప్రొబేషన్, కన్ఫర్మేషన్ ప్రక్రియను పూర్తిచేసి, సవరించిన విధంగా రెగ్యులర్ జీతాలను (న్యూ పేస్కేలు)ఈ ఏడాది జులై జీతం నుంచి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చానని పేర్కొన్నారు. అలాగే ఏపీ ఉద్యోగులకు 23 శాతం పీఆర్సీని ప్రకటించడంతో పాటు…. ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితిని కూడా పెంచేశారు. ఇప్పటి వరకు పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలు ఉండగా దానిని 62 సంవత్సరాలకు పెంచారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.