ఉద్యోగుల సమస్యలను ఇప్పట్లో తీర్చేలా లేరు జగన్. ఎప్పటికప్పుడు ఏదో ఒక తప్పుడు నిర్ణయంతోనే ముందుకు వెళ్తున్నారు. ఈ సాయంత్రానికి అంటే శనివారం (05.02.2022) నాటికి ఏదో ఒక సానుకూలతతో కూడిన నిర్ణయం వస్తుందని మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని చెబుతున్న సమయంలో మరో పిడుగులాంటి వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. ఏపీ గనుల శాఖకు చెందిన ఉద్యోగులపై ఎస్మాచట్టం ప్రయోగించారన్న వార్తతో జగన్ పై మళ్లీ మళ్లీ కయ్యానికి కాలు దువ్వుతున్నారు ఉద్యోగులు.
సామరస్య పూర్వక ధోరణిలో తగాదా సర్దుమణుగుతుంది అనుకున్న తరుణాన ఈ విధంగా చేయడం తగదని ఉద్యోగులు చెబుతున్నారు. ఏదేమయినప్పటికీ సలహాదారుల మాటకు విలువ ఇస్తున్న కారణంగానే జగన్ కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుని తరువాత దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు అని ఉద్యోగులు మండిపడుతున్నారు.
తమది ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని అంటారు. కానీ అందుకు విరుద్ధంగా ఉంటారు. స్నేహమే కావాల్సింది అయితే మరి ఎందుకు ఎస్మాను ప్రయోగించారని? అని ఉద్యోగులు గోల చేస్తున్నారు. తాము ఫైర్ అని ఫ్లవర్ కాదని తమతో పెట్టుకోవద్దని ఇప్పటికే ఉద్యోగులు చలో విజయవాడ అనే కార్యక్రమం ద్వారా, సంబంధిత ఉద్యమ కార్యాచరణ ద్వారా నిరూపించారు. అయినా కూడా సర్కారు తానేం చేయాలనుకుంటున్నదో అదే చేస్తుంది. దీంతో ఇరు పక్షాల మధ్య చర్చల్లో పురోగతి పై దీని ప్రభావం పడనుంది.
ఆంధ్రావనిలో ఉద్యోగులు యుద్ధ వాతావరణం నడుమ విధులు నిర్వర్తిస్తున్నారు. కొందరైతే భయాందోళనలతోనే కాలం నెట్టుకువస్తున్నారు. జీతాల విషయమై నెలకొన్న ప్రతిష్టంభన అన్నది తొలగిపోక పోవడంతో వారి ఆందోళనలు మరింత రెట్టింపు అవుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొన్ని విషయాల్లో సానుకూలంగా ఉన్నా కూడా మరోవైపు కొన్ని ఉద్రిక్తతలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా గనుల శాఖ ఉద్యోగులపై ఏపీ సర్కారు ఎస్మాస్త్రం సంధించింది.
అంటే నిబంధనలకు విరుద్ధంగా సమ్మె కు వెళ్లవద్దని,వెళ్లే విధంగా చర్యలుంటే చట్ట ప్రకారం శిక్షార్హులు అని తేల్చేసింది.దీంతో అంతా విస్మయం వ్యక్తం చేస్తన్నారు. చర్చలకు సంబంధించి అటు ఉద్యోగ సంఘాలు, ఇటు మంత్రుల కమిటీ రకరకాలుగా తర్జనభర్జనలు పడుతున్న వేళ సర్కారు నిర్ణయంపై అంతటా విమర్శలు వస్తున్నాయి. ఇంతకూ ఈ నిర్ణయం మంచిదేనా? ఉద్యోగులపై ఎస్మా చట్టం ప్రయోగించి జగన్ ఏం సాధిస్తారని?