లెక్కలు వెల్లడికి వస్తాయి
వాస్తవాలు ఆగిపోతాయి
నిజాలు నిలువెత్తు సమాధి అయి ఉంటాయి
కానీ ఆశలు జీవం పోసుకుని కొత్త ఉదయం
దిశగా పయనిస్తాయి..మేలుకో భారతీయుడా మేలుకో!
జీవితం ఆశారహితం..బడ్జెట్ కాగిత రహితం..అంటే ఓ విధంగా పర్యావరణ హితం కోరి చేస్తున్న పని ఇది అని నిర్మలమ్మ అండ్ కో సమర్థించుకోవచ్చు కానీ ఆ పని కారణంగా కొంత ఆదాయం మిగులు అన్నది ఒప్పుకోవచ్చు మనం కానీ అదే నిజం కాదు. ఏదయితేనేం బడ్జెట్ వస్తే ఏటా మనకు కొన్ని రకాల రంగాలు ఏ విధంగా ఉన్నాయో తెలుస్తుంది. మన ఇంటి లెక్కలు ఏ విధంగా మారిపోనున్నాయో తేలిపోతుంది. పోపుల డబ్బాలో పొదుపు సూత్రాలు ఇంకే విధంగా అమలు చేయాలో అన్నది అమ్మ నేర్చుకుంటుంది.
నాన్న ఇంకాస్త పొదుపుగా ఉండాలని మనకు చెబుతాడు. అంటే సామాన్యుడికి పొదుపు సూత్రాలను చెప్పేందుకే బడ్జెట్ తప్ప సంపన్న వర్గాల కట్టడికి మాత్రం ఇదే మాత్రం ఉపయోగ పడదు అని గతంలోనూ తేలిపోయింది.ఇవాళ కూడా అదే తేలనుంది.నిర్థారితం కానుంది. అయినా కూడా దేశంలో మనం ఉన్నాం కనుక అతిగా విమర్శించరాదు. ఆ విధంగా మనం నిశ్శబ్దం పాటించాలి.నిర్మలత్త ఏం చెప్పినా వినాలి. ఏం చేసినా విని ఊరుకోవాలి. అప్పుడే మనకు బాగుంటుంది. ఏం చేయడం చెప్పండి.. గత కొన్నేళ్లుగా విని విని బోర్ అయిపోయిన టాపిక్ బడ్జెట్ కాక ఇంకేంటి?
అస్సలు రాయని మాటలు కొన్ని ఉన్నాయి. రాయకుండా ఉండిపోవడమే మేలు. డిస్కషన్ అన్నది వేస్టు. ఎందుకంటే మనమేం చెప్పినా కూడా వినే స్థితి లేదు. వినిపించుకునే ఓపిక కూడా లేదు. అలాంటప్పుడు మనం చెప్పి సాధించేది ఏమీ ఉండదు. సాధించి చూపితే ఆనందమే కానీ! అక్కడ మాత్రం మన ఎంపీల మాట నెగ్గదు.ఆవిధంగా మోడీ అనే ప్రధాన మంత్రికి మరియు నిర్మల అనే ఆర్థిక మంత్రికి ఈ సారి కూడా మనం ఏం చెప్పలేం చెప్పకూడదు కూడా!
బడ్జెట్ లో ఏం ఉండాలి ఆహా! చాలా చిన్న ప్రశ్న. మంచి పథకాలు ఉండాలి. సామాన్యుడి ఆశలు ఉండాలి.ఆశలను ప్రతిఫలింపజేసే విధంగా నిధులు ఉండాలి. నిధుల కేటాయింపు ఉన్నాకూడా పట్టించుకోని రోజులు ఇవాళ దేశంలో ఉన్నాయి. పాలకవర్గాల నిర్లక్ష్యం కారణంగా అస్సలు అనుకున్నవేవీ జరగడం లేదు. రాష్ట్రాలకు ఉన్న భయం కారణంగా ఇవాళ అనుకున్నవేవీ జరగడం లేదు. దీంతో మనకు పోలవరం పూర్తికాదు. నిధులు రావు. ఎస్టిమేట్ వాల్యూ అన్నది మాత్రం పెరిగిపోతూనే ఉంటుంది. బడ్జెట్ అంటే అంకెలు.. అవి విని చదివి నవ్వుకోవాలి.బడ్జెట్ అంటే అంకెల గారడీ విని చదివి తరువాత వాటిపై తల పట్టుకోవడం మినహా సామాన్యుడికి ఉపయోగం అయ్యేది ఏమీ ఉండదు.
చాలా రోజుల కిందట లక్ష కోట్ల బడ్జెట్ అని వైఎస్సార్ చెప్పారు. అది విని చాలామంది నవ్వుకున్నారు. ఆ తరువాత విభజిత ఆంధ్రాలో లక్ష కోట్ల బడ్జెట్ అన్నారు. అది కూడా విని నవ్వుకున్నారు.అంటే బడ్జెట్ అంటే రూపాయి రాక మరియు పోకను సవివరంగా అందించే లెక్క అని అంటారు కానీ అది ఏ మాత్రం నిజం కాదు. అంకెలలతో ఆకాశ హర్మ్యాల నిర్మాణం మన నాయకులకే సాధ్యం. ఊహల్లో ఉంచి సామాన్యుడిని రంజింపజేయడం మన నాయకులకే సాధ్యం. బడ్జెట్ అంటే లెక్కల పద్దు
అని అంటారే కానీ అబద్ధాల పుట్ట అని ఎందుకు రాయరు. రాయాలి రాస్తేనే ఆనందం. ఆ విధంగా ఎవ్వరు రాయకున్నా కోపమే!
– డిస్కషన్ పాయింట్ – మన లోకం ప్రత్యేకం