హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుత కమిటీ స్థానంలో ఏక సభ్య కమిటీని నియమించింది. సుప్రీం కోర్టు మాజీ జడ్జి జస్టిస్ లావు నాగేశ్వరరావుతో ఏకసభ్య కమిటీని రూపొందించింది. ఇకపై హెచ్‌సీఏ వ్యవహారాలు కొత్త కమిటీ చూసుకుంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొత్త కమిటీ నివేదిక ప్రకారం తదుపరి ఆదేశాలు ఉంటాయని పేర్కొంది.
ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో పలుమార్లు విభేదాలు బయటపడిన విషయం తెలిసిందే. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. మరోవైపు గతంలో ఉప్పల్ మ్యాచ్‌లో జరిగిన తప్పిదాలతో.. హెచ్‌సీఏ తలనొప్పులు మొదలయ్యాయి. అజహరుద్దీన్.. క్రికెట్ మ్యాచ్ టికెట్లను పక్కదారి పట్టిస్తున్నారు. ఆన్‌లైన్ టికెట్లలో కూడా గోల్‌మాల్ చేశారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. వర్గ పోరు, అధికార కాంక్షతో వివాదాలకు నిలయమైన హెచ్‌సీఏలో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు హెచ్ సీఏ కమిటీని రద్దు చేసింది.