సీఎంకి సిగ్గు, రోషం ఉంటే రాజీనామా చేయాలి : డీకే అరుణ

దుబ్బాక ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. సీఎం, వారి కుటుంబ సభ్యులు పలికిన ప్రగల్బాలకు చెంప పెట్టు ఈ తీర్పు అని ఆమె అన్నారు. అధికార అహంకారంతో అరాచకాలు, అవినీతితో వ్యవహరించిన తీరు దుబ్బాక ప్రజలు గమనించారని అన్నారు. దుబ్బాక ప్రజలు రాష్ట్రానికి మేలు జరిగే తీర్పు ఇచ్చారు.. వారికి చేతులెత్తి నమస్కారం అని ఆమె అన్నారు.

సీఎం కి ఆ సీట్లో కూర్చొనే అర్హత లేదన్న ఆమె రాజీనామా చేసి ఎన్నికలకు పోవాలని డిమాండ్ చేశారు. సిగ్గు, రోషం ఉంటే రాజీనామా చేయాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారామె. రాజీనామా చేస్తే నీకు రాజకీయ విలువలు ఉన్నట్టు లేకుంటే లేనట్టు అని ఆమె అన్నారు. దుబ్బాక ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారన్న ఆమె తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. అవినీతి పాలనను అంతం చేయాలని చూస్తున్నారన్న ఆమె మధ్యప్రదేశ్, కర్ణాటక లో అధికార పార్టి ని అక్కడ ప్రజలు గెలిపించారని అన్నారు.