రాష్ట్ర ప్రభుత్వాలు , గవర్నర్ల మధ్య వివాదాలు మామూలైపోయాయి. మొన్నటిదాకా దిల్లీ, కేరళ, తెలంగాణ ఈ జాబితాలో ఉండేది. ఇప్పుడు ఈ లిస్టులోకి తాజాగా తమిళనాడు కూడా చేసింది. ఏకంగా గవర్నర్ను తొలగించాలని అధికార పార్టీ రాష్ట్రపతికి లేఖ రాసేవరకు వీరి మధ్య వివాదం దారి తీసింది. తమిళనాడు గవర్నర్, అధికార డీఎంకే మధ్య కొన్నాళ్లుగా ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. వారి మధ్య ఘర్షణ వాతావారణం ముదిరి తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ చెంతకు చేరింది.
గవర్నర్ ఆర్‌ఎన్ రవి.. శాంతి భద్రతలకు ముప్పంటూ రాష్ట్రపతికి రాసిన లేఖలో డీఎంకే తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రజలకు సేవ చేయనీకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేసింది. ఆయన ప్రకటనలు ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెంచే విధంగా ఉన్నాయని, కొన్ని ప్రసంగాలు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని అందులో పేర్కొంది. ఆయన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండేందుకు అనర్హులని, వెంటనే తొలగించాలని ఆ లేఖలో అభ్యర్థించింది.
పలు బిల్లులు గవర్నర్ వద్దే ఆగిపోవడం, ప్రైవేటు కార్యక్రమాల్లో సనాతన ధర్మం, ద్రావిడం గురించి గవర్నర్ రవి చేసిన వ్యాఖ్యలు రుచించకపోవడంతో డీఎంకే, దాని మిత్రపక్షాలు ఆ చర్యలను బహిరంగంగానే ఖండిస్తున్నాయి. ఆమోదం పొందాల్సిన బిల్లులు 20 వరకూ ఆయన వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని ఆమెదించకుండా కావాలనే జాప్యం చేస్తున్నారని డీఎంకే ఆ లేఖలో ఆరోపించింది. ఈ వ్యవహారశైలితో ఇరు వర్గాల మధ్య సఖ్యత కొరవడినట్లు కనిపిస్తోంది. తాజా లేఖపై గవర్నర్ స్పందించాల్సి ఉంది.