ఒక్క ఓటుతో మారిపోయేది ఏముంటుందిలే అని చాలా మంది అనుకుంటారు. కానీ ఆ ఒక్క ఓటు విలువ ఎంతో చరిత్రలో నమోదైన కొన్ని ఘటనలు చెబుతాయి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ కీలకమే…ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా ప్రాధాన్యత ఉంది. మనం ఓటు వేయనంత మాత్రాన ఏం మునిగిపోతుందనుకోవడమే పెద్ద పొరపాటు…ప్రతి ఓటూ నేతల తలరాతను మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చరిత్రలో జరిగిన కొన్ని కీలక ఘటనలు చూస్తే..ఓటుకు ఎంత విలువ ఉందో తెలుస్తుంది.
1649లో ఇంగ్లాండ్ రాజు కింగ్ చార్లెస్-1 శిరచ్ఛేదనంపై నిర్ణయం జరిగింది ఒకే ఓటు తేడాతోనే. 1714లో ఒక్క ఓటు ఆధిక్యంతోనే బ్రిటన్ రాజు సింహాసనం అధిష్ఠించారు. 1776లో ఒక్క ఓటు తేడాతోనే అమెరికాలో జర్మనీ భాషను కాదని ఇంగ్లిష్ అధికారిక భాష అయింది. 1850లో ఒక్క ఓటు ఆధిక్యంతో కాలిఫోర్నియా రాష్ట్రం ఏర్పడింది. 1868లో అమెరికా అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ ఒక్క ఓటుతో పదవీచ్యులతయ్యారు. 1923లో ఒకే ఓటు ఆధిక్యంతో హిట్లర్ నాజీ పార్టీకి నాయకుడిగా ఎన్నికయ్యారు.
మన దేశంలో ఒక్క ఓటు నేతల తలరాతలు మార్చింది. ప్రభుత్వాల్ని పడగొట్టింది. 1999 ఎన్నికల్లో ఓక్క ఓటు తేడాతోనే కేంద్రంలో వాజ్‌పేయీ ప్రభుత్వం పడిపోయింది. 2004 ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలోని సంతెమరహళ్లిలో ఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి ధ్రువనారాయణ గెలిచారు.2016 ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జాంబాగ్ డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థిపై ఎంఐఎం పార్టీ అభ్యర్థి కేవలం ఐదు ఓట్లు తేడాతో విజయం సాధించారు.
2008లో రాజస్థాన్‌లో ఒక్క ఓటు తేడాతో ఓటమిపాలైన ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సీపీ జోసీనాథ్ ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఆ ఎన్నికల్లో జోషి తల్లి, భార్య, డ్రైవర్ ఓటు హక్కు వినియోగించుకోలేదు. డ్రైవర్ ఓటు వేయడానికి వెళ్తానని అడిగినా.. జోషీయే ఆపారట. చివరకు ఆయన ఒక్క ఓటుతో ఓడిపోవడంతో.. ఆశపడ్డ సీఎం సీటుతో పాటు.. ఎమ్మెల్యే పదవి కూడా దూరమైంది.
ప్రపంచంలోకెల్లా అతిపెద్ద, శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశంగా పేరు పొందిన మనదేశంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు చాలామంది ప్రజలు ముందుకు రావడం లేదు. ఓటు విషయంలో వారికి ఉన్న అనాసక్తి వల్ల ప్రభుత్వాలు మెజారిటీ ప్రజల ప్రమేయం లేకుండానే ఏర్పడుతున్నాయి.