అసలే అంతంత మాత్రంగా ఉన్న బీజేపీ గ్రాఫ్‌ను మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ నేతలకు భారీ ఎదురు దెబ్బతగిలింది. బీజేపీలో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా ఎదుగుతున్న అనంతపురానికి చెందిన విష్ణు వర్థన్‌రెడ్డి తాజాగా అమరావతిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్యమాన్ని వక్రీకరించే ప్రయత్నంలో ఆయన నోరు జారారు. 50 వేల ఖరీదైన చీరలు కట్టుకున్న ఓ నాయకురాలు.. ఇక్కడ ఉద్యమం చేస్తున్నారు అని నోరు పారేసుకున్నారు. ఇది తీవ్ర వివాదానికి దారితీసింది.
నిజానికి బీజేపీ ఎదుగుతున్న క్రమంలో ఇప్పటి వరకు ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పైగా మహిళా సెంటిమెంటుతో కూడి ఉన్న పరిస్థితిలో విష్ణువర్ధన్‌రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మరింతగా పార్టీని డిఫెన్స్‌లో పడేసిందనే చెప్పాలి. కొన్ని సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా వాటి నుంచి బయట పడేందుకు అవకాశం ఉంటుంది. కానీ, ఇలాంటి వ్యాఖ్యలతో పార్టీ పరువును పోగొట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి విష్ణు వర్ధన్ రెడ్డి కంటే.. కూడా అనేక మంది నాయకులు ఫైర్ బ్రాండ్లుగా అనేక విమర్శలు చేశారు.
కానీ, ఇలా ఎప్పుడూ మహిళలపై కామెంట్లు చేయలేదు. దీంతో పార్టీపై ఇప్పటికీ అంతో ఇంతో సింపతీ , సెంటిమెంటు రెండూ కూడా ఉన్నాయి. ఓటు బ్యాంకు సాధనలో మహిళలను ప్రధాన అస్త్రం చేసుకు నేందుకు బీజేపీ పెద్దలు.. రాష్ట్రంలోని మహిళలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ సమయంలో బీజేపీ పక్షాన ఉన్న విష్ణువర్ధన్‌రెడ్డి.. వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నిజానికి పార్టీలైన్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్న కోణంలో సోము వీర్రాజు.. చాలా మందిపై వేటు వేస్తున్నారు.
కానీ, పార్టీలోనే ఉంటూ.. లైన్‌ను విస్మరించడం లేదని చెప్పుకొంటూ.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీకి జరుగుతున్న డ్యామేజీని గుర్తించడం లేదా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఏదేమైనా.. విష్ణు వర్ధన్‌రెడ్డి వ్యాఖ్యలు తీవ్రసంచలనమే రేపుతున్నాయనడంలో సందేహం లేదు. మరి ఎలాంటి పరిణామాలు తెరమీదికి వస్తాయో చూడాలి.