ఆల్కహాల్ సేవించడం వల్ల బాగా నిద్ర వస్తుందని, చక్కగా నిద్రపోవచ్చని ఎవరైనా అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే.. ఆల్కహాల్‌కు, గాఢ నిద్రకు సంబంధం లేదు.
మానవ శరీరంపై ఆల్కహాల్ ప్రభావం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఆల్కహాల్ సేవించడం వల్ల మత్తుగా, మగతగా ఉంటుంది. ఇక పరిమితికి మించి సేవిస్తే.. కిక్కు నశాలానికి ఎక్కుతుంది. దీంతో వాంతులు అవుతాయి. తరువాత హ్యాంగోవర్ వస్తుంది. అయితే హ్యాంగోవర్ వచ్చేదాక కాకపోయినా.. రోజూ చక్కగా నిద్ర పోవచ్చని చెప్పి కొందరు ఆల్కహాల్ సేవిస్తుంటారు. దీని వల్ల మత్తులోకి జారుకుని తద్వారా నిద్ర పోవచ్చని చాలా మంది అనుకుంటుంటారు. అయితే మరి.. ఆల్కహాల్ సేవించడం వల్ల నిజంగానే హ్యాపీగా నిద్ర పోవచ్చా..? చక్కగా నిద్ర పడుతుందా..? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆల్కహాల్ సేవించడం వల్ల బాగా నిద్ర వస్తుందని, చక్కగా నిద్రపోవచ్చని ఎవరైనా అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే.. ఆల్కహాల్‌కు, గాఢ నిద్రకు సంబంధం లేదు. మత్తు వస్తుంది కనుక అందులో నిద్ర పోతారు. అంతేకానీ.. గాఢ నిద్ర వచ్చేందుకు ఆల్కహాల్ ఏమాత్రం సహాయం చేయదు. పైగా నిద్రావస్థ అనే శరీర ప్రక్రియకు ఆల్కహాల్ భంగం కలిగిస్తుందట. దీంతో శరీరం నిద్రపోయేటప్పుడు చేసుకునే సహజ జీవక్రియలకు భంగం కలుగుతుందట.
అలాగే ఆల్కహాల్ సేవించడం వల్ల మూత్రాశయంపై అధిక భారం పడుతుందని, అది రాత్రి పూట కూడా బాగా పనిచేయాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో మూత్రం వస్తుందని, అది నిద్రకు భంగం కలిగిస్తుందని వైద్యులు అంటున్నారు. కనుక ఆల్కహాల్ అనేది మనం నిద్ర పోయేందుకు ఏమాత్రం ఉపయోగపడదని, సహజ సిద్ధంగా నిద్ర వస్తే అది మనకు ఆరోగ్యకరమని, అంతేకానీ ఆల్కహాల్ సేవించి గాఢ నిద్ర పోవాలనుకుంటే అది మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కనుక ఆల్కహాల్ సేవించి బాగా నిద్రపోదామనుకునే వారూ.. జాగ్రత్తగా ఉండండి.. సహజంగా నిద్రించేందుకు ప్రయత్నించండి..!