ఫ్లాసింగ్‌తో పళ్లు శుభ్రంగా ఉంటాయా..? మీకు ఈ అలవాటుందా..?

-

పళ్లను శుభ్రంగా ఉంచుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్‌.. కానీ మనలో అందరూ రోజూ ఉదయం బ్రష్‌ చేస్తే చాలు పని అయిపోయిందిలే అనుకుంటారు.. ముందుండే ఆ నాలుగు పళ్లు బాగుంటే చాలదు.. ఒకసారి లోపలు పళ్లు, దంతాల కింద పేరుకుపోయిన పాచి పారా చూస్తే అరే ఇది అసలు మన నోరేనా అనిపిస్తుంది. పళ్లును ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే శుభ్రంగా తోముకోవడంతో పాటు.. ఫ్లాసింగ్ కూడా చేయాలి. చాలామందికి ఇదేంటో తెలియకపోవచ్చు. అవును ఏంటి ఫ్లాసింగ్ అంటే.? ఏం చేస్తారు, ఎలా చేస్తారు, దీని వల్ల ఉపయోగం ఏంటి..? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానమే ఈ కథనం.!

ఫ్లాసింగ్‌ అంటే ఏంటి.?

ఫ్లాసింగ్ అనేది దంతాలను శుభ్రం చేసుకునే ఒక పద్ధతి. దంతాల మధ్య ఇరుక్కున్న ఆహార పదార్థాల కణాలు కొన్నిసార్లు టూత్ బ్రష్ చేసుకున్నప్పటికీ పోవు. టూత్ బ్రష్ చేరుకోలేని మూలాల్లోకి సన్నని తంతువులతో కూడిన త్రాడును ఉపయోగించి పళ్ల సందుల్లో ఇరుకున్న ఆహారం, దంత ఫలకాన్ని తొలగించుకోవడాన్నే ఫ్లాసింగ్ అంటారు. నోటి ఆరోగ్యం కోసం ఫ్లాసింగ్ చేయమని దంతవైద్యులు సూచిస్తారు.

మాంసాహారం తినేవారు ఫ్లాసింగ్ చేసుకోవడం చాలా మంచిది. మాంసం తిన్నప్పుడు పళ్ల సందుల్లో ఇరుక్కుంటుంది. దీంతో చాలా మంది టూత్ పిక్స్ ఉపయోగించి తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల పళ్ల మధ్య సందు ఏర్పడి అది ఒక స్టేజ్‌కి వన్‌వే రహదారి లెక్క అయిపోతుంది. ఫ్లాసింగ్ ఇందుకు చక్కని పరిష్కారంగా ఉంటుంది. ఇది దంతాల మధ్య చిక్కుకున్న ఆహారాన్ని తేలికగా శుభ్రపరుస్తుంది. నోటిలో బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా అడ్డుకుంటుంది.

ఫ్లాసింగ్ ఎలా చేయాలి?

ఫ్లాసింగ్ సరైన రీతిలో చేయాలి. ఫ్లాసింగ్ సరిగ్గా చేయకుంటే దంతాలు, చిగుళ్ళకు హాని కలగవచ్చు. కాబట్టి సరైన ఫ్లాస్ త్రాడును ఎంచుకోండి. 18 నుండి 24 అంగుళాల డెంటల్ ఫ్లాస్‌ను కత్తిరించి. మీ బొటనవేలు, చూపుడు వేలుకు ఫ్లాస్‌ను చుట్టి ప్రతి పంటికి రెండు వైపులా రుద్దుతూ, ఫ్లాస్‌ను మెల్లగా పైకి క్రిందికి గ్లైడ్ చేయండి. మీ చిగుళ్ళ లోపలి దాకా ఫ్లాస్‌ను గ్లైడ్ చేయవద్దు.

బ్రష్‌ చేయకముందే చేయాలా..?

టూత్ బ్రష్ చేయకముందు ఫ్లాసింగ్ చేయాలి. ఫ్లాస్ చేయడం వలన దంతాల మధ్య ఇరుకున్న ఆహార కణాలు బయటకు వస్తాయి, వదులుగా అవుతాయి. ఇప్పుడు బ్రష్ చేయడం వలన ఈ కణాలు మీ నోటి నుండి తొలగిపోతాయి. ప్రతిరోజూ టూత్ బ్రష్ చేస్తున్నట్లే ఫ్లాసింగ్ చేయడం కూడా అలవాటు చేసుకోవాలి. రోజుకు ఒకసారి లేదా ప్రత్యామ్నాయ రోజులలో ఫ్లాసింగ్ చేసుకోవాలని నిపుణులు అంటున్నారు.

దీనిపై ఇంకా స్పష్టత రావాలంటే సోషల్‌ మీడియాలో వీడియోస్ చూడండి. పూర్తి అవగాహన వస్తుంది. మిడిమిడి జ్ఞానంతో పళ్ల మీద ప్రయోగం చేస్తే లేనిపోని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.!

Read more RELATED
Recommended to you

Exit mobile version