విటమిన్ టాబ్లెట్స్ వాడితే బాడీలో ఏ విటమిన్ తక్కువైన కవర్ అయిపోతుంది అనుకుంటారు. అందుకే ఏ విటమిన్ నుంచి జింక్ వరకూ ఎన్నో మాత్రలు మనకు అందుబాటులోకి వచ్చాయి. కొందరైతే వీటికో తోడు.. ప్రొబయోటిక్స్, మూలికా ఔషధాలు, చేపనూనె వంటివీ ఎడాపెడా తీసుకుంటూ ఉంటారు. ఈ మహమ్మారి వచ్చినప్పటినుంచే వీటి వాడకం ఇంకాస్త పెరిగింది. ఒక్కో విటమిన్ కి ఒక్కో టాబ్లెట్ ఎందుకని చాలామంది మల్టీవిటమిన్ టాబ్లెట్ వేసేసుకుంటారు. నిజానికి ఈ టాబ్లెట్ మనకు అవసరమేనా..పొంచి ఉండే అనర్థాల మాటేమిటి? ఎంతవరకూ వీటి వాడకం కరెక్టో చూద్దాం.
ఎవరికి కావాలి?
అయితే అందరూ ఆహారం ద్వారా ఈ విటమిన్స్ భర్తీ చేయలేరు. వయసు మీద పడుతున్నకొద్దీ కొన్ని రకాల పోషకాలను గ్రహించుకునే సామర్థ్యం శరీరానికి తగ్గుతూ వస్తుంది. అందుకే వృద్ధులు విటమిన్ డి, విటమిన్ బి12, క్యాల్షియం వంటి విటమిన్లు, పోషకాలను అదనంగా తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రకాల పదార్థాలు తిననివారికీ ఇవి అవసరం.
విటమిన్ బి12 మాంసాహారంతోనే లభిస్తుంది. కాబట్టి శాకాహారులకు దీని లోపం తలెత్తకుండా మాత్రలు, సిరప్‌లు ను వైద్యులు సూచిస్తుంటారు. గర్భిణులకు, గర్భధారణకు ప్రయత్నిస్తున్నవారికి ఫోలిక్ యాసిడ్ అవసరం. ఇది పుట్టబోయే పిల్లల్లో నాడీ లోపాల సమస్యల నివారణకు తోడ్పడుతుంది. శిశువులకు తల్లిపాలతోనే తగినంత విటమిన్ డి లభించదు. అందువల్ల అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. గుండెజబ్బు, మధుమేహం, క్యాన్సర్, హెచ్‌ఐవీ/ఎయిడ్స్, కొన్ని స్వీయ రోగనిరోధక సమస్యల వంటి జబ్బులతో బాధపడేవారికి అదనంగా పోషకాలు అవసరమవుతాయి. ఎవరికి ఎలాంటి పోషకాలు, ఎంత మోతాదులో కావాలనేది లెక్కకట్టి చెప్పలేం. అలాఅని దుకాణంలో దొరుకుతున్నాయని ఎవరికివారు కొనుక్కొని వేసుకోవటం తగదు. డాక్టర్‌ను సంప్రదించి, అవసరమైన పోషకాలను, తగు మోతాదులో తీసుకోవటం మంచిది. రక్త పరీక్షల ద్వారా ఏయే పోషకాలు లోపించాయో తెలుసుకోవచ్చు.
విటమిన్ మాత్రలు వేసుకునేవారు ఏదైనా చికిత్స కోసం డాక్టర్ దగ్గరికి వెళ్లినప్పుడు కచ్చితంగా మీరు వాడే విటమిస్ టాబ్లెట్స్ ఏవో వారికి చెప్పాలి. ఎందుకంటే కొన్ని మాత్రలు ఆయా మందుల పనితీరును ప్రభావితం చేయొచ్చు. ఆహారం ద్వారా, మాత్రల ద్వారా ఎంతవరకు పోషకాలు లభిస్తున్నాయో కూడా చూసుకోవాలి. అదనంగా తీసుకుంటే ఏమవుతుందిలే అనుకోవద్దు. మోతాదు ఎక్కువైతే కొన్ని పోషకాలు ప్రమాదకరంగానూ పరిణమించొచ్చు. అతి మంచిదికాదుకదా..! మూలికా ఔషధాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఒంట్లో రకరకాలుగా ప్రభావం చూపొచ్చు. అప్పటికే వాడుతున్న మందుల పనితీరునూ దెబ్బతీయొచ్చు. దుష్ప్రభావాలను సైతం కలిగించొచ్చు.
విటమిన్ మాత్రలతో రోగనిరోధకశక్తి పెరుగుతుందన్నది మనలో చాలామంది అనుకుంటారు. ఇందులో పూర్తిగా నిజం కాదు. విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, జింక్, సెలీనియం, మెగ్నీషియం వంటివి రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయటానికి కీలకమే. కానీ అవసరమైన దానికన్నా ఎక్కువ మోతాదులో తీసుకుంటే రోగనిరోధకశక్తి పుంజుకుంటుందని పరిశోధనల్లో ఎక్కడా బయట పడలేదు. కొవిడ్ నివారణకు, నయం కావటానికి తోడ్పడే విటమిన్లు, ఖనిజాలను సిఫారసు చేయటానికి అవసరమైన రుజువులేవీ ఇప్పటివరకూ లభించలేదు.
అతిగా విటిమిన్ టాబ్లెట్స్ వాడటం ఏమాత్రం మంచిదికాదు. ముఖ్యంగా యుక్తవయసులో ఉన్నవారికి అసలు విటమిస్ టాబ్లెట్స్ అనవసరం. వారు ఏది తిన్నా సులభంగా జీర్ణించుకోగల శక్తి శరీరానికి ఉంటుంది కాబట్టి..శరీరంలో ఫలనా విటమిన్ తక్కువైంది అని వైద్యులు చెప్తే..అది ఏ ఆహారంలో లభిస్తుందో ఆ ఆహారాన్ని మీ డైట్ లో చేర్చుకోండి..అంతేకాని..ఆ విటమిన్ టాబ్లెట్ పడేస్తే పని అయిపోతుంది కదా అనుకోవటం మంచి పద్దతి కాదు. వైద్యులు కూడా మీకు ఆహారంతో పాటు ఆ టాబ్ లెట్స్ చెప్పి..చాయిస్ మీదన్నట్లు వదిలేస్తారు.
-Triveni Buskarowthu