మద్యం మైకంలో ఏం చేస్తున్నారో.. ఎందుకు చేస్తున్నారో తెలియకుండా ఘోరాలకు పాల్పడుతున్నారు కొందరు. అలాంటి ఘటనే దేశరాజధానిలో చోటు చేసుకుంది. తాను తినడానికి చపాతి ఇవ్వలేదని ఓ రిక్షాకార్మికుడిని చంపేశాడు ఓ మద్యంమత్తులో ఉన్న వ్యక్తి. ఈ నెల 26న రాత్రి 10 గంటల సమయంలో మున్నా (40) అనే రిక్షాకార్మికుడు మరో వ్యక్తితో కలిసి ఢిల్లీలోని కారోల్ బాఘ్‌లో చపాతీ తింటున్నాడు. ఇంతలో ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఫిరోజ్.. తనకు చపాతీ ఇవ్వాలని మున్నాను అడిగాడు. దీంతో మున్నా అతడికి ఓ రొట్టె ఇచ్చాడు. మరో చపాతీ కావాలని అడగడంతో అతడు తిరస్కరించాడు. నాకే ఇవ్వవా అని ఆవేశంతో ఊగిపోయిన ఫిరోజ్.. తిట్ల దండకం మొదలు పెట్టాడు. అంతటితో ఆగకుండా మున్నాను కొట్టసాగాడు.
రిక్షాకార్మికుడు ఎదురు తిరగడంతో కోపోద్రిక్తుడైన అతడు.. పదునైన కత్తితో మున్నా పొడిచి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే అక్కడే ఉన్న మరో వ్యక్తి ఫిరోజ్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అతడు దొరకకపోవడంతో.. రక్తపు మడుగులో ఉన్న మున్నాను స్థానికుల సహాయంతో దవాఖానకు తీసుకెళ్లాడు. అయితే అప్పటికే అతడు మృతిచెందాడని నిర్ధారించారు డాక్టర్లు. ప్రత్యక్ష సాక్షి చెప్పిన వివరాల మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఢిల్లీలో గాలింపు చేపట్టి నిందితుడు ఫిరోజ్ ఖాన్‌ను పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదుచేశారు.