తిరుమలలో కూల్చిన అన్నమయ్య ఇంటిని అదే చోట పునఃనిర్మించాలని జై భారత్ కార్యదర్శి దున్న లక్ష్మేశ్వర్ కోరారు. అన్నమయ్య గృహ సాధన సమితి ఏర్పాటుకు సంబంధించి ఆదివారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ దగ్గరున్న అన్నమయ్య విగ్రహం వద్ద కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తొలి వాగ్గేయకారుడు, కవితా పితామహుడు, 32 వేల సంకీర్తనలతో శ్రీ వేంకటేశ్వరుడి అర్చించి.. తెలుగు భాషను సుసంపన్నం చేసిన అన్నమయ్య ఇంటిని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) 2003లో మాస్టర్ ప్లాన్‌లో భాగంగా తొలగించిందన్నారు. దీనిని జై భారత్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని జై భారత్ కార్యదర్శి గణేశ్ గల్ల, మహేష్ తెలిపారు.
అన్నమయ్య భక్తి ఉద్యమంతోనే అనేక సంస్కరణలకు ఆధ్యం పోశారన్నారు. ఆనాడున్న కుల వ్యవస్థ, లింగ వ్యవస్థకు వ్యతిరేకంగా అనేక సంకీర్తనలతో ప్రజలను చైతన్య పరిచారని.. ఆ రోజుల్లోనే టీటీడీ దేవస్థానంలో దళితుల ఆలయ ప్రవేశం కోసం, మహిళలకు విద్యను అందించాలని కృషి చేశారన్నారు. అలాంటి మహనీయుడి ఆనవాళ్లు లేకుండా టీటీడీ అనాలోచిత పనులు చేయడం దౌర్భాగ్యం అన్నారు. టీటీడీ వెంటనే స్పందించి.. అన్నమయ్య గృహాన్ని లేదా స్మారక మందిరాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
దీనిలో భాగంగానే ఈ నెల 28న హైదరాబాద్ కేంద్రంగా తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సనాతన సమధర్మ ప్రచార పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయశంకర్ స్వామి, జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి, విజయవిహారం ఎడిటర్ రమణమూర్తి, పోతులూరి వీరభ్రమ్మేంద్ర స్వామి ముని మనవడు వీరబట్లయ్య, దున్న ఇద్దాసు పీఠాధిపతి దున్న విశ్వదాసు తదితరులు హాజరు కానున్నట్లు తెలియజేశారు. కావున, అన్నమయ్యను, తెలుగు భాషను ఆరాధించే ప్రతిఒక్కరూ హాజరు కావాలని ఖదిజ్ఞాసి రాజు కోరారు. ఈ కార్యక్రమంలో రాజు, లావణ్య, అరవింద్, దున్న లక్ష్మేశ్వర్, అశోక్, కల్పన, గణేశ్, రాణి, ప్రవళి తదితరులు పాల్గొన్నారు.