మహారాష్ట్రలో శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఇంట్లో ఈడీ సోదాలు హాట్ టాపిక్‌గా మారాయి. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి రెండు సార్లు సమన్లు జారీ చేసినా ఆయన హాజరు కాలేదంటూ.. ఆదివారం ఉదయం నుంచే సంజయ్ రౌత్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. సాయంత్రం వరకు తనిఖీలు చేయడంతోపాటు సంజయ్ రౌత్ ను, ఆయన కుటుంబ సభ్యులను ప్రశ్నించిన ఈడీ అధికారులు.. సాయంత్రం ఆయనను అదుపులోకి తీసుకుంటున్నట్టు ప్రకటించారు.
అప్పటికే పెద్ద సంఖ్యలో సీఆర్పీఎఫ్, పోలీసు బలగాలను సంజయ్ రౌత్ నివాసం వద్ద మోహరించి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సందర్భంగా సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. నాకు వ్యతిరేకంగా తప్పుడు ఆధారాలను సృష్టించారని, శివసేనకు, నాకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర ఇదని, దీనికి నేను భయపడబోనని ఆయన ప్రకటించారు.