జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహిస్తున్నది. టెండర్ స్కామ్ వ్యవహారంలో సీఎం హేమంత్ సహా ఆయన సన్నిహితుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సాహెబ్‌గంజ్, మీర్జా చౌకీ, బెర్హత్, రాజ్‌మహల్ సహా మొత్తం 18 ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచే సోదాలు చేస్తున్నారు. సీఎం సోరెన్ ప్రతినిధి పంకజ్ మిశ్రా ఇండ్లలోనూ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాడుల సమయంలో ఈడీ అధికారులు పారామిలిటరీ బలగాల సాయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. నిన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విస్తృత దర్యాప్తు నేపథ్యంలో వివో మొబైల్స్ తయారీ సంస్థ డైరెక్టర్లు జెంగ్‌షెన్ ఔ, చాంగ్ చియా చైనాకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
మనీలాండరింగ్ ఆరోపణలపై చాలా రోజులుగా వివోపై ఈడీ దృష్టిపెట్టడంతో.. వివోకు చెందిన 44 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసిన తర్వాత ఆ సంస్థ డైరెక్టర్లు పారిపోయినట్లు ప్రచారం జరిగింది. అయితే.. వివో మొబైల్స్ డైరెక్టర్లు ఇద్దరు గతేడాదే చైనాకు వెళ్లిపోయినట్లు ఈడీ అధికారి ఒకరు చెప్పారు. ఇదే ఆరోపణలపై సీబీఐ అధికారులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. ఐటీ విభాగం, కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ సైతం వివో సంస్థ వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్నాయి. ఇతర చైనా సంస్థల ఆర్థిక అవకతవకలపై విచారణలో భాగంగానే వివోపైనా దర్యాప్తు చేస్తున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. వివో మొబైల్స్‌కు సంబంధించి ఈడీ దర్యాప్తు అంశాన్ని నిశితంగా గమనిస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ తెలిపింది. భారత దర్యాప్తు సంస్థలు చట్టాలకు లోబడి చైనా సంస్థలపై పారదర్శకంగా దర్యాప్తు చేస్తాయని ఆశిస్తున్నట్లు వెల్లడించింది.