మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మరియు మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత, మరో నేత వర్ల రామయ్య ఇవాళ ఒకే సబ్జెక్ట్ పై మాట్లాడారు. టీడీపీ కి చెందిన తమ పాత మిత్రుడు తాజా శత్రువుపై నోరేసుకుని పడిపోయారు. ఆ విధంగా మంత్రి కొడాలి నానిని ఉద్దేశించి అంతా బాగానే మాట్లాడారు. కట్టు తప్పిన భాష గురించి వెంకన్న కూడా మాట్లాడితే ఏమయిపోవాలి. నాని నోరు జారారు మేం కూడా అంతే అన్న బాపతులో మాట్లాడే నేతలున్న వరకూ ఈ క్యాసినో గొడవలు చల్లారవు.
పోనీ మరో సంక్రాంతి వరకూ ఈ తగాదాను మీడియా ముఖంగా నడిపిస్తూ ఉండండి చాలు. ఇంకేం వద్దు. పోలీసులు కూడా అధికారం ఎటు ఉంటే అటే అన్న విధంగా విమర్శలు ఎదుర్కొంటున్నారంటే వెంకన్న అరెస్టు బాగానే ఉంది కానీ వెంకటేశ్వర్లు (కొడాలి శ్రీ వెంకటేశ్వర్లు) ను మాత్రం కంట్రోల్ చేయడంలో విఫలం అవుతున్నారన్న వాదన ఒకటి వస్తుంది. పోలీసులు చేయకపోయినా కనీసం పోలీస్ బాస్ అయినా చెప్పవచ్చు కదా అన్న మాట కూడా ఒకటి వినిపిస్తూ ఉంది. జగన్ అయితే అస్సలు జోక్యం చేసుకోవడం లేదు ఎందుకనో అన్న మాట కూడా ఇదే సమయాన మరింత బలంగా వినిపిస్తూ ఉంది.అంటే ఆయన కంట్రోల్ చేయరా? అనగా బూతులు మనం వినాల్సిందే?నా!
రాజకీయంలో ఒకరినొకరు ఇంతగా తిట్టుకోవాల్సిన పని లేదు.గుడివాడ క్యాసినో ఎంత బలమైందో ఆ రోజు కాల్ మనీ తగాదా కూడా అంతే బలమైంది. గుడివాడ యుద్ధం గొప్పదో ఆ రోజు అమరావతి రైతు యుద్ధం కూడా అంతే గొప్పది. పేకాట అన్నది ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ ఉంది. కనుక మనం ఏమీ పెద్దగా మథన పడిపోనక్కర్లేదు. అయితే రాజ్యంలో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు సమయం సందర్భంతో పాటు సంయమనం అన్న పెద్ద పాయింట్ ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ రోజు ఏం జరిగింది. సచివాలయం కేంద్రంగా ఏం జరిగింది లేదా గుడి వాడ కేంద్రంగా ఏం జరిగింది అన్నవి వెలికితీద్దామా? ఆ రోజు హాయ్ ల్యాండ్ చుట్టూ జరిగిన రాజకీయం గురించి లోకేశ్ తో సహా ఇతరులను కూడా ఒక్కసారి ప్రశ్నిద్దామా? అంటే అగ్రీ గోల్డ్ కథ మరిచిపోయి టీడీపీ ఉన్నట్లుంది. కాదనం కానీ గోవా రంగుల్లో గోవా హంగుల్లో గుడివాడ క్యాసినోను కూడా ఎవ్వరూ అంత వేగంగా మరువరు లేండి. కనుక ఎవరి పని వారు హాయిగా చేసుకోండి.
ఆ రోజు వినడానికి బూతులు లేవు అని అనుకునేందుకు లేదు. అప్పుడూ ఉన్నాయి కానీ కాస్త కంట్రోల్ లో ఉన్నాయి ఇప్పుడు ట్రోల్ లో ఉన్నాయి. కనుక మనం ఎవ్వరినీ ఏం అనలేం. ఓ రాష్ట్ర మంత్రిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు బుద్ధా వెంకన్న అనే ఓ మాజీ ఎమ్మెల్సీ వాడే భాష అదేనా! అంటే ఎవరికి పడుతుంది. అదేవిధంగా ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడే మాటలు అవేనా అని కొడాలి నానిని ఉద్దేశించి చెబుదామంటే ఎవరికి వినపడుతుంది? ఏంకాదు ఇలాంటి నాటకాలు మీడియాకు మంచి వినోదాలనే ఇస్తాయి కానీ ప్రజలకు ఉపయోగపడని పస లేని నాటకాలు ఎందుకని?