ఎడిట్ నోట్: హస్తంలో చిచ్చు..కేసీఆర్ ఎత్తు..!

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు తారస్థాయిలో కొనసాగుతుంది. ఇప్పటికే నేతల మధ్య సయోధ్య లేదు..బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టార్గెట్ గా సీనియర్ నేతలు గళం విప్పుతున్నారు. ఇటు సీనియర్లని పక్కకు తప్పించాలనే దిశగా రేవంత్ కూడా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు బీఆర్ఎస్-బీజేపీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. కానీ కాంగ్రెస్ ఆ రేసులో వెనుకబడింది. వారిలో వారే తగువులాడుకోవడం సరిపోతుంది.

ఇప్పటికే తాజాగా పదవుల పంపకాల విషయంలో పెద్ద రచ్చ నడుస్తోంది. తమకు చిన్న పదవులు ఇచ్చారని కొంతమంది సీనియర్లు భగ్గుమన్నారు..కొంతమంది రాజీనామాలు చేశారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క లాంటి వారు రేవంత్ పై డైరక్ట్ కామెంట్లు చేయలేదు. కానీ తాజాగా రేవంత్ టార్గెట్ గా విరుచుకుపడ్డారు. టీడీపీ నుంచి వచ్చిన వారికే సగం పదవులు ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీని ఓ వర్గం కైవసం చేసుకోవాలని చూస్తుందని ఫైర్ అయ్యారు.

తాజాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో అసంతృప్తి నేతలంతా భేటీ అయ్యారు. సేవ్‌ కాంగ్రెస్‌ పేరుతో రేవంత్‌ టార్గెట్‌గా కార్యాచరణకు సంబంధించిన రోడ్‌‌మ్యాప్‌ను రెడీ చేసుకుంటున్నారు. ఇదే సమయంలో సీనియర్ నేతలంతా కోవర్టులనే ప్రచారం వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదంతా రేవంత్ వర్గం కావాలనే ప్రచారం చేస్తుందనే అంశంపై కూడా చర్చించారు.

అయితే ఇటీవల వ్యూహకర్త సునీల్ కానుగోలు ఆఫీసుపై సైబర్ పోలీసులు దాడి చేసిన విషయం తేలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని చెప్పి రైడ్స్ చేశారు. ఈ రైడ్స్‌లో కేసీఆర్ ప్రభుత్వంపై కొన్ని కార్టూన్లుతో పాటు, బీజేపీపై కార్టూన్లు..అలాగే కాంగ్రెస్ సీనియర్లని విమర్శించే విధంగా కొన్ని పోస్టులు, కార్టూన్లు కూడా రెడీ చేశారట. ఈ విషయం కాంగ్రెస్ సీనియర్లకు తెలియాలని చెప్పి..పోలీసులు కొందరు సీనియర్ నేతలకు ఫోన్లు చేసి..వాటిని మళ్ళీ తిరిగి ఇచ్చేశారట.

అంటే కేసీఆర్ సర్కార్ ఆడే గేమ్‌లో రేవంత్‌ని దెబ్బతీయడానికి కాంగ్రెస్ సీనియర్లతోనే రివర్స్ ఎత్తు వేసినట్లు తెలుస్తోంది. రేవంత్ పైకి సీనియర్ల మాటల దాడి పెంచేలా స్కెచ్ వేశారు. అందుకు తగ్గట్టుగానే సీనియర్లు ఇప్పుడు రేవంత్ టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు..అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. మరి చూడాలి కాంగ్రెస్ లో రచ్చ ఎంతవరకు వెళుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news