ఉమ్మడి అనంతపురం జిల్లా, ఉరవ కొండ పంచాయతి ఇప్పుడు హెడ్ లైన్స్ షో లో నిలుస్తోంది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఇక్కడి పోలీసు స్టేషన్లో కేసు ఫైల్ అయింది. తమ పంచాయతీ నిధులు 71.50 లక్షల రూపాయలు తమకు చెప్పాపెట్టకుండానే విభిన్న కారణాలతో మూడు సార్లు గుంజుకున్నారు అని అందుకు తగ్గ ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని పేర్కొంటూ పోలీసులను ఆశ్రయించారు.ఇక్కడి ఉరవకొండ మండలంలోని వ్యాసాపురం, పెద్ద ముష్టూరు, పెద్ద కౌకుంట్ల గ్రామ సర్పంచ్ లు తమ పంచాయతీ ఖాతాల్లో నిధులు గల్లంతయ్యాయని గత ఏడాది జూలై 17న, నవంబర్ 22న, ఈ ఏడాది మార్చి 31న వరుసగా మూడు సార్లు ఈ విధంగానే జరిగిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసినా కూడా న్యాయ స్థానంను సైతం ఆశ్రయించి తమ హక్కులను సాధించుకుంటామని అంటున్నారు వీరంతా !
ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా పరిణామాలు నెలకొని ఉన్నాయని ప్రధాన మీడియా ఆధారాలతో సహా వెలుగులోకి తెస్తోంది. ఇది ఓ విధంగా స్థానిక పంచాయతీలకు రాజ్యాంగం ద్వారా దఖలు పడిన హక్కులను కాలరాయడమే అన్న ఆరోపణ ఒకటి బలీయంగా వినిపిస్తోంది. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి ముష్టెత్తి మరీ నిన్నటి వేళ కర్నూలులో నిరసనలు తెలిపారు. ఇదేవిధంగా శ్రీకాకుళంలోనూ కొందరు సర్పంచులు భిక్షాటన చేసి మరీ తమ దయనీయ స్థితిని ప్రజానీకానికి వివరించే ప్రయత్నం ఒకటి చేశారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా స్థానిక సంస్థల అధికారాలు హరిస్తూ సీఎం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా తమకు గ్రామాల్లో ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి అని, దీంతో తప్పక సొంత డబ్బులతో పనులు చేయించినా బిల్లులు వస్తాయో రావో అన్న తికమకతో తామున్నామని పలువురు సర్పంచులు వాపోతున్నారు. ఇప్పటికే గత సర్కారులో చేసిన పనులకు బిల్లులు రాక కొందరు ఆత్మ హత్యలు చేసుకున్న దాఖలాలు ఉన్నా కూడా ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదని వీరంతా తమ సహచర ప్రజాప్రతినిధులను తలుచుకుని కన్నీటిపర్యంతం అవుతున్నారు. కేవలం కక్ష సాధింపులో భాగంగానే ఇలా చేస్తున్నారా? అన్నది టీడీపీ ఆరోపణ. సంశయం కూడా !