ఎడిట్ నోట్: తెలంగాణలో ‘బాబు’..తెలివైన రాజకీయం.!

-

మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లోకి మరోసారి చంద్రబాబు ఎంట్రీ ఇచ్చారు. మళ్ళీ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా బాబు ప్రణాళికలు రచిస్తున్నారు. అందుకోసం టీడీపీ నుంచి వెళ్ళి ఇతర పార్టీల్లో ఉన్న మాజీ తమ్ముళ్లని తిరిగి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అయితే గతంతో పోలిస్తే ఈ సారి భిన్నంగా బాబు..తెలంగాణలో రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి టీడీపీకి ఏపీతో పోలిస్తే తెలంగాణలోనే ఎక్కువ బలం ఉండేది. ఉమ్మడి ఏపీ ఉండగా..తెలంగాణలోనే టీడీపీకి ఆదరణ ఎక్కువ.

 

కానీ రాష్ట్ర విభజన, చంద్రబాబు ఏపీకే పరిమితం కావడం, కేసీఆర్ ఎత్తులతో తెలంగాణలో టీడీపీ పూర్తిగా దెబ్బతింది. నాయకులు ఇతర పార్టీల్లోకి వలస వెళ్లిపోయారు. అయితే 2018 ఎన్నికల్లో ఎలాగోలా పార్టీని నిలబెట్టుకోవాలని చెప్పి..కేసీఆర్‌ని ఓడించాలని కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. పైగా ఏపీలో బాబుని ఓడించడానికి కేసీఆర్…జగన్‌కు పూర్తి మద్ధతిచ్చారు. దీంతో ఏపీలో కూడా టీడీపీ ఓడిపోయింది. ఆ తర్వాత నుంచి బాబు తెలంగాణ జోలికి వెళ్ళడం లేదు. ఏపీలోనే టీడీపీని గాడిలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక ఎప్పుడైతే కేసీఆర్..టీఆర్ఎస్‌ పార్టీని కాస్త బీఆర్ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారో అప్పటినుంచి బాబు కూడా తన వర్షన్ మార్చారు. కేసీఆర్…ఏపీలో కూడా బీఆర్ఎస్ పార్టీని విస్తరించాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో బాబు తెలంగాణలో టీడీపీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. తాజాగా ఖమ్మంలో భారీ సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. భారీ స్థాయిలో టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు సభకు హాజరయ్యారు. దీని బట్టి తెలంగాణలో టీడీపీని అభిమానించే వారు ఇంకా ఉన్నారని అర్ధమైంది.

అయితే ఖమ్మం సభలో బాబు చాలా తెలివిగా ముందుకెళ్లారు. గతంలో టీడీపీ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలని ఎక్కువ చెప్పారు. తెలంగాణ అభివృద్ధి చెందడానికి టీడీపీ కృషి ఉందని చెప్పుకొచ్చారు. అంటే టీడీపీ గురించే ఎక్కువ చెప్పారు..కానీ తెలంగాణలో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ల గురించి ఒక్క మాట మాట్లాడలేదు.

మళ్ళీ కేసీఆర్‌ని టార్గెట్ చేస్తే రాజకీయంగా తెలంగాణలో ఇబ్బందులు వస్తాయని అనుకున్నారేమో..అసలు కేసీఆర్ పేరు తీయలేదు. అటు బీజేపీ ఎలాగో కేంద్రంలో అధికారంలో ఉంది..కాబట్టి బీజేపీ పేరు ఎత్తలేదు. ఇటు కాంగ్రెస్ ఊసు తీయలేదు. మొత్తానికి ఎవరిపై విమర్శలు చేయకుండా..టీడీపీ చేసిన పనులు చెప్పి..మళ్ళీ పార్టీని ఆదరించాలని, ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోయిన టీడీపీ నేతలు మళ్ళీ తిరిగి రావాలని కోరారు. మొత్తానికి తెలంగాణ రాజకీయాలపై బాబు తెలివిగా వ్యవహరించారని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news