మొత్తానికి చాలా రోజుల తర్వాత తెలంగాణలో బిజేపి దూకుడు పెంచింది. పార్టీలో అంతర్గత పోరు..కీలక మార్పులు..బండి సంజయ్‌ని తప్పించి అధ్యక్షుడుగా కిషన్ రెడ్డిని నియామించడం..ఈ పరిణామాలతో బిజేపి రేసులో వెనుకబడింది. దీంతో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే వార్ ఓ స్థాయిలో నడుస్తుంది. ఇక బిజేపిని ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. అలాగే ఆ పార్టీలోకి వలసలు కూడా ఆగిపోయాయి. దీంతో ఇంకా బిజేపి వెనుకబడినట్లే అని అంతా అనుకున్నారు.
కానీ కిషన్ రెడ్డి సైతం దూకుడుగా పనిచేయడం మొదలుపెట్టారు. కేసిఆర్ ప్రభుత్వాన్ని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. ఇదే సమయంలో వలసలు మొదలయ్యాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు బిజేపిలోకి వచ్చారు. మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, ఉమ్మడి మెదక్ జిల్లా దివంగత నేత బాగారెడ్ది తనయుడు, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి..వీరంతా ఢిల్లీకి వెళ్ళి జేపి నడ్డా సమక్షంలో బిజేపిలో చేరారు.
అయితే వీరే కాదు ఇంకా కొందరు నేతలు సైతం బిజేపిలో చేరడానికి రెడీగా ఉన్నారని తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యేలు సొత్కు సంజీవరావు, అమరాజుల శ్రీదేవిలు సైతం బిజేపిలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. వీరు ఇప్పటికే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేశారు. అటు సినీ నటి జయసుధ సైతం బిజేపిలో చేరడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే ఆమె కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు.
2009లో ఆమె సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత టిడిపి, వైసీపీ అంటూ కొన్నాళ్లు పార్టీ కండువాలు మార్చారు. కానీ ఇప్పుడు ఆమె బిజేపిలో చేరేందుకు సిద్ధమైపోయారు. మొత్తానికి బిజేపిలోకి వలసలు కంటిన్యూ కానున్నాయి. ఇదే ఊపు కొనసాగితే బిజేపి బలం అనూహ్యంగా పెరిగి..మళ్ళీ రేసులోకి వస్తుందనే చెప్పాలి. దీని వల్ల ఎన్నికల్లో బిజేపి సత్తా చాటాడానికి అవకాశాలు ఉంటాయి.