ఎడిట్ నోట్: మిషన్-90..లక్ష్యం నెరవేరుతుందా?

-

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని చెప్పి బీజేపీ గట్టిగా ట్రై చేస్తుంది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీకి పోటీగా బీజేపీ ముందుకెళుతుంది. ఎక్కడకక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టేలా రాజకీయం చేస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉండటం, కేంద్రం పెద్దలు సపోర్ట్, వారు కూడా తెలంగాణపై ఫోకస్ చేయడంతో..బీజేపీ నేతలు ఏ మాత్రం తగ్గకుండా బీఆర్ఎస్‌పై ఫైట్ చేస్తున్నారు. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుంది.

గత ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..ఇప్పుడు రాష్ట్రం మొత్తం బలపడేలా ముందుకెళుతుంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ రోజురోజుకూ బలహీన పడటం బీజేపీకి పెద్ద ప్లస్ అయింది. కాంగ్రెస్ వీక్ అవ్వడంతో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీని చూస్తున్నారు. ఆ పార్టీ నేతలు కూడా ప్రజా క్షేత్రంలో గట్టిగానే పోరాడుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన శక్తి వంచన లేకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. మిగిలిన నేతలు ఎవరికి తగ్గట్టుగా వారు పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.

కేంద్రం పెద్దలు కూడా తెలంగాణపై స్పెషల్ గా ఫోకస్ చేసి పనిచేస్తున్నారు. ఎప్పటికప్పుడు రాష్ట్రానికి వస్తూ..పార్టీ పరిస్తితులని చూసుకుంటున్నారు. ఇదే క్రమంలో తాజాగా బీఎల్ సంతోష్ రాష్ట్రానికి వచ్చారు. ఈ మధ్య ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో  బి‌ఎల్ సంతోష్ పేరు కూడా వచ్చిన విషయం తెలిసిందే. సిట్ సైతం ఆయనకు నోటీసులు ఇచ్చింది. కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు..మళ్ళీ సిట్ నోటీసులు ఇచ్చింది. ఇదే క్రమంలో హైకోర్టు..సిట్ నుంచి ఈ కేసుని సీబీఐకి అప్పగించింది.

ఆ కేసు అలా ఉండగానే సంతోష్ తెలంగాణకు వచ్చి..పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే సమయంలో ఆయన.. అనవసరంగా కేసులో ఇరికించే ప్రయత్నం చేసి అప్రతిష్టపాలు చేశారని అసహనం వ్యక్తం చేశారు. తనపై చేసిన అవాస్తవ ప్రచారానికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని, అంతేకాదు తనపై ఆరోపణలు చేసిన వారు ముందు ముందు పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉంటే ఇదే కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 90 సీట్లతో విజయం సాధించబోతుందంటూ జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, పెద్ద ఎత్తున పోలింగ్ బూత్‌లపై సమ్మేళనం నిర్వహిస్తామని, మిషన్ 90ని తెలంగాణ ప్రజలు ఆశీర్వదించాలని బండి సంజయ్ కోరారు.

అయితే 90 సీట్లు టార్గెట్ అనేది ఈజీ కాదు..బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టడం సులువు కాదు..అటు కాంగ్రెస్ పార్టీని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆ పార్టీకి ఇంకా క్షేత్ర స్థాయిలో బలం లేదు..ఇంకా చెప్పాలంటే 90 సీట్లలో బీజేపీకి క్షేత్ర స్థాయిలో బలం రాలేదు. కాబట్టి బీజేపీ ఇంకా బలపడాల్సిన అవసరం ఉంది.బలమైన నాయకులు ఆ పార్టీకి కావాలి. క్యాడర్ కావాలి. అప్పుడే టార్గెట్ రీచ్ అవుతారు.

 

Read more RELATED
Recommended to you

Latest news