తెలంగాణలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. అధికార బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా కాంగ్రెస్ రేసులోకి వచ్చింది. ఈ రెండు పార్టీల మధ్య ఇప్పుడు పోరు రసవత్తరంగా సాగనుంది. మొన్నటివరకు బిజేపి రేసులో ఉంది ..కానీ అనూహ్యంగా ఆ పార్టీ వెనుకబడిపోయింది. ఇక వలసలు కూడా ఆగిపోయాయి. దీంతో ఆ పార్టీకి ప్రస్తుత పరిణామాలు ఏవి కలిసి రావడం లేదు. అయితే తెలంగాణలో క్షేత్ర స్థాయిలో బలం ఉన్న పార్టీల్లో బిఆర్‌ఎస్ ఆ తర్వాత కాంగ్రెస్ ఉంది.
కానీ కేసిఆర్ చేసిన రాజకీయం..కమలం నేతల దూకుడుగా వెళ్ళడంతో..రాష్ట్రంలో బిఆర్‌ఎస్ వర్సెస్ బిజేపి అన్నట్లు ఫైట్ నడిచింది. కానీ అది కృత్రిమమైన రాజకీయ పోరు అని తేలిపోయింది. అసలు బలం కాంగ్రెస్ పార్టీకి ఉంది. కర్నాటక ఎన్నికల్లో గెలుపు తర్వాత తెలంగాణలో కాంగ్రెస్‌కు ఊపు వచ్చింది. ఈ క్రమంలోనే ఆ పార్టీలోకి చేరికలు బాగా కలిసొచ్చాయి. ఊహించని చేరికలు ఆ పార్టీలో కొనసాగుతున్నాయి. బిఆర్‌ఎస్, బిజేపిలోని కీలక నేతలు కాంగ్రెస్ వైపు వస్తున్నారు.
ప్రధానంగా బిఆర్‌ఎస్ లోని కీలక నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో సహ 35 మంది నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇంకా కొందరు నేతలు కాంగ్రెస్ వైపు వస్తున్నారు. దీంతో కాంగ్రెస్ లో జోష్ నెలకొంది. పైగా జులై 2న ఖమ్మంకు రాహుల్ గాంధీ వస్తున్నారు. ఆయన సమక్షంలో భారీ చేరికలు ఉన్నాయి.
అటు కాంగ్రెస్ లో జోష్ ఉంటే..కమలం పార్టీలో క్లాష్ నడుస్తుంది. అసలే రేసులో వెనుకబడింది. ఈ క్రమంలో బండి సంజయ్ తో కొందరు నేతలకు పడటం లేదు. ఇప్పటికే పార్టీలో యాక్టివ్ గా లేని ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాని కలిసి..అధ్యక్షుడు గా బండిని తొలగించాలని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అదే సమయంలో ఈటల, కోమటిరెడ్డి సైతం పార్టీ మార్పుపై ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. కానీ షా సముచిత స్థానం ఇస్తామని చెప్పారని, పార్టీలో కీలక మార్పులకు అంగీకారం తెలిపారని..దీంతో ఈటల, కోమటిరెడ్డి పార్టీ మార్పుని వాయిదా వేసుకున్నారని తెలిసింది. కానీ ఏదేమైనా కాంగ్రెస్ లో జోష్ ఉంటే..కమలంలో క్లాష్ నడుస్తుంది.