ఎడిట్ నోట్: ఫినిషింగ్ టచ్..!

-

మరో కొన్ని గంటల్లో మునుగోడు ఉపఎన్నిక మొదలు కానుంది. తెలంగాణ రాష్ట్రం ఆసక్తిగా ఎదురుచూస్తున్న మునుగోడు ఉపఎన్నికలో గెలవడానికి ప్రధాన పార్టీలు శాయశక్తుల కష్టపడ్డాయి. ఓటర్లని ఆకర్షించడానికి నానా రకాల తిప్పలు పడ్డారు. ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకోవడమే కాదు..ఏకంగా భౌతికమైన దాడులకు కూడా దిగారు. ముఖ్యంగా టీఆర్ఎస్-బీజేపీ శ్రేణులు కర్రలు, రాళ్ళతో కొట్టుకున్నారు. అంటే మునుగోడు ఉపఎన్నిక ఏ స్థాయి వరకు వెళ్ళిందో అర్ధం చేసుకోవచ్చు.

కోట్ల డబ్బులు, మద్యం, విందులు అంటూ ఈ కొన్ని రోజులు మునుగోడు జాతర మాదిరిగా జరిగింది. ఇక ప్రచారం ఒక ఎత్తు..ఇప్పుడు ఎన్నికల ముందు కొన్ని గంటలు ఒక ఎత్తు అన్నట్లు ఉంది. రాత్రికి రాత్రే ఓటర్లని ఆకర్షించడానికి పార్టీలు ఎన్ని రకాలుగా కష్టపడతాయో చెప్పాల్సిన పనిలేదు. ఇక ఫినిషింగ్ టచ్‌గా ప్రధాన పార్టీల నేతలు..మునుగోడు ప్రజలని ఎమోషనల్‌గా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

కాంగ్రెస్, బీజేపీలు ఏమి చేయవని, తామే అన్నీ చేయాలని, ప్రజలకు అండగా ఉండేది తామే అని, కాబట్టి కారు గుర్తుకు ఓటు వేయాలని టీఆర్ఎస్… తాను రాజీనామా చేయడం వల్లే మునుగోడుకు నిధులు వచ్చాయని, మీ బిడ్డగా తనని ఆశీర్విందించాలని బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు. ఇక మునుగోడు ఆడబిడ్డ స్రవంతిని సంపుకుంటారో, సాదుకుంటారో మీ ఇష్టమని, ఆడబిడ్డ కంటతడి మంచిది కాదని, నిండు మనసుతో ఆడబిడ్డని ఆశీర్విందించాలని రేవంత్ రెడ్డి ఎమోషనల్ మెసేజ్ ఇచ్చారు.

ఇలా మూడు పార్టీలు ఎమోషనల్‌గా ఓటర్లని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక ఈ కొన్ని గంటల్లో నోట్ల కట్టాల ప్రవాహం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. అయితే మునుగోడు ప్రజల నాడి ఏంటి అనేది ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు. మరి వారు ఎవరికి వైపు నిలుస్తారు..ఎవరిని గెలిపిస్తారనేది చూడాలి. ఎన్నిక మొదలయ్యే సమయం వరకు పార్టీలు గట్టిగానే కష్టపడతాయి. మరి ఎవరి వైపు ప్రజలు ఉంటారో 6వ తేదీన తేలుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news