వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారంలోకి రావడమే లక్ష్యంగా జగన్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకున్నాం..ఈ సారి 175కి 175 సీట్లు గెలవాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఓ వైపు తాను బటన్ నొక్కుతూ ప్రజలకు సంక్షేమ పథకాల పేరిట డబ్బులు వేస్తున్నారు. మరో వైపు ఆ పథకాలని గడపగడపకు తిరుగుతూ ప్రజలకు వివరించే పనిలో ఉన్నారు ఎమ్మెల్యేలు. ఇలా రెండువైపులా ప్రజలని ఆకట్టుకునేలా జగన్ ముందుకెళుతున్నారు.అయితే ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరుపై వర్క్ షాపులు పెట్టి జగన్..వారికి క్లాస్ ఇస్తున్నారు. సరిగ్గా పనిచేయని వారికి గట్టిగానే క్లాస్ ఇస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా వర్క్ షాప్ జరగగా, అందులో దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు సరిగ్గా గడపగడపకు వెళ్ళడం లేదని క్లాస్ ఇచ్చారు.
అదే సమయంలో ఇంకా ఎన్నికలకు రెడీ అవ్వడమే లక్ష్యంగా దిశా నిర్దేశం చేశారు. ఎన్నికలకు ఇంకా 14 నెలల సమయం ఉందని.. వీటిని ఆషామాషీగా తీసుకోవద్దని, గత ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని.. గతంలో కంటే భిన్నంగా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే నగదు జమ అవుతున్న విషయాన్ని జనానికి వివరించాలని చెప్పారు.అలాగే 5.20 లక్షల మంది గృహ సారథులు.. 45,000 మంది సచివాలయ సమన్వయకర్తలు, రెండున్నర లక్షల మంది వలంటీర్ల వ్యవస్థతో వైసీపీ బలంగా ఉందని, వచ్చే నెల 18 నుంచి 26వ తేదీ వరకూ గృహ సారథులకు శిక్షణ తరగతులు నిర్వహించాలని, వచ్చే నెల 18, 19 తేదీల్లో వీటిలో ఎమ్మెల్యేలు తప్పకుండా పాల్గొనాలని, అలాగే రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనే స్టిక్కర్లు అంటించాలని సూచించారు. మొత్తానికి జగన్ పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు.
అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటంతో గడపగడపకు బ్రేక్ వేశారు. మళ్ళీ మార్చి 18 నుంచి కార్యక్రమం మొదలుకానుంది. ఇక ఈ దఫా సరిగ్గా గడపగడపకు వెళ్లని వారు..ఈ సారి మంచి పనితీరు కనబర్చాలని సూచించారు. మళ్ళీ మే లో వర్క్ షాప్ నిర్వహిస్తానని చెప్పారు. మొత్తానికి ఎన్నికల్లో గెలవడానికి జగన్ యాక్షన్ ప్లాన్ షురూ అయిందని చెప్పవచ్చు.