ఏపీలో ఎన్నికల సమయం ఆసన్నమైందనే చెప్పాలి. కరెక్టుగా షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే ఇంకా ఎన్నికలకు ఏడాది వరకు సమయం ఉంది..కానీ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయా? అంటే చెప్పలేం. ఎందుకంటే జగన్ ముందస్తు ఎన్నికలకు ప్లాన్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రత్యర్ధులకు చెక్ పెట్టేందుకు జగన్ ముందస్తుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని ఎప్పటినుంచో ప్రచారం ఉంది. అధికార వైసీపీ మినహా మిగిలిన పార్టీలు ముందస్తు జరుగుతుందనే అంటున్నాయి.
కానీ తమకు పూర్తిగా పాలన చేయమని ప్రజలు అవకాశం ఇచ్చారని, అందుకే 5 ఏళ్ళు ఉంటామని వైసీపీ నేతలు చెబుతున్నారు..కాకపోతే అందులో ట్విస్ట్ ఉండే అవకాశాలు లేకపోలేదు. జగన్ అనూహ్యంగా ముందస్తుకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇటీవల జగన్ దూకుడు చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. ఆయన భారీ సభలతో జిల్లాలు చుట్టేస్తున్నారు. ఏదొక కార్యక్రమం పేరుతో జనంలోనే ఉంటున్నారు. అలాగే పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధమంటూ కొత్త స్లోగన్ అందుకున్నారు. దానికి సంబంధించిన ఫ్లెక్సీలు ప్రతి నియోజకవర్గంలో ఉండేలా చూసుకుంటున్నారు.
ఇక జగన్ దూకుడు చూసిన చంద్రబాబు కాస్త ముందుగానే మేలుకున్నట్లు కనిపిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అని భావించి..ఆయన సైతం అభ్యర్ధులని ఫిక్స్ చేయడం, ఆఖరికి మినీ మేనిఫెస్టో కూడా ప్రకటించారు. అందులో మహిళలు, యువత, రైతులకు సంబంధించిన కీలక హామీలు ఇచ్చారు. అయితే బాబు ఇంచిన హామీలని మించేలా..జనాలకు మళ్ళీ అండగా ఉండే విధంగా జగన్ సైతం సరికొత్త మేనిఫెస్టో రూపొందిస్తున్నారని తెలిసింది.
ఇప్పుడు ఇచ్చే సంక్షేమ పథకాలు కాకుండా..ఇంకా సరికొత్త పథకాలని తెరపైకి తీసుకురావడానికి జగన్ ప్లాన్ చేశారని సమాచారం. కీలక హామీలతో ఎన్నికల మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఎలాగో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తారని జగన్ మంచి పేరు తెచ్చుకున్నారు..కాబట్టి ఇంకా వాటికి మించే హామీలు ఇచ్చి..ప్రజల మద్ధతు పెంచుకోవాలని చూస్తున్నారు. అతి త్వరలోనే కీలక హామీలతో మేనిఫెస్టో సైతం ప్రకటిస్తారని తెలుస్తుంది. మొత్తానికి మళ్ళీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా జగన్ మేనిఫెస్టో ఉంటుందని తెలుస్తుంది.