ఎడిట్ నోట్: జనసేన@10..!

-

జనసేన పార్టీ..ప్రశ్నించడం కోసం పుట్టిన పార్టీ. ప్రజా సమస్యలపై ప్రశ్నించడం కోసం, పోరాటం చేయడం కోసం పవన్ కల్యాణ్ పెట్టిన పార్టీ. సినిమాల్లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోగా రాణిస్తూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ ప్రజలకు ఏదో చేయాలనే తపనతో జనసేన పార్టీ పెట్టారు. అయితే తెలుగుదేశం పార్టీ మాదిరిగా పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి రాలేదు..వైసీపీకి లాగా వెంటనే ప్రతిపక్షం, ఆ తర్వాత అధికారం సాధించలేదు. ఇప్పటికీ పట్టుమని 10 సీట్లు కూడా గెలుచుకోలేదు..కానీ అప్పుడే పార్టీ పెట్టి పదేళ్ళు అయింది.

కరెక్టుగా 2013 మార్చి 14న పవన్..జనసేన పార్టీ పెట్టారు. రాష్ట్రాన్ని విభజన చేయడానికి సిద్ధమైన కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. అయితే రాష్ట్రం విడిపోయాక 2014లో జరిగిన ఎన్నికల్లో పవన్ పోటీకి దిగలేదు. కొత్తగా వచ్చిన పార్టీ పోటీ చేస్తే గెలవడం కష్టం..కాకపోతే ఓట్లు చీలుస్తామనే భయం..అందుకే టీడీపీ-బీజేపీకి మద్ధతు ఇచ్చారు. దీంతో 2014లో ఆ రెండు పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చాయి. కొన్నాళ్లు రెండు పార్టీలకు మద్ధతు ఇచ్చారు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బి‌జే‌పి రాష్ట్రానికి హోదా ఇవ్వడం లేదు..న్యాయం చేయట్లేదు..దీంతో బి‌జే‌పిని విభేదించారు.

Pawan Kalyan

ఆ తర్వాత టి‌డి‌పితో విభేదించారు..రెండు పార్టీలపై విరుచుకుపడ్డారు. ఇక 2019 ఎన్నికల్లో తొలిసారి బరిలో దిగారు..బి‌ఎస్‌పి, సి‌పి‌ఐ, సి‌పి‌ఎంలతో కలిసి పోటీ చేశారు. కేవలం ఒక సీటు గెలిచారు. పవన్ రెండుచోట్ల ఓడిపోయారు. అయినా సరే పవన్ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉన్నారు. ఓ వైపు తన వృత్తి సినిమాలు చేస్తూనే..మరోవైపు జనసేన పార్టీని నడిపిస్తున్నారు.

కానీ అనుకున్న మేర బలోపేతం చేయడంలో పవన్ వెనుకబడ్డారు. ఇప్పుడు 10వ ఆవిర్భావ వేడుకలు చేసుకుంటున్నారు. ఇకనుంచైనా పార్టీకి కొత్త ఊపు తీసుకొస్తారేమో చూడాలి. కాకపోతే పవన్‌కు ఎక్కడ తగ్గాలో తెలుసు. పార్టీకి బలం పెరగలేదని తెలుసు..సింగిల్ గా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి వైసీపీకి లాభం జరుగుతుందని తెలుసు..అందుకే గౌరవం తగ్గకుండా టీడీపీతో కలిసి ముందుకెళ్ళేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇలా పొత్తుతో కాకుండా పవన్ సింగిల్ గా ఎప్పుడు గెలిచి అధికారంలోకి వచ్చి సి‌ఎం అవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news