ఎడిట్ నోట్: కేసీఆర్‌కు చిక్కులు..!

-

అటు తిరిగి..ఇటు తిరిగి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..సీఎం కేసీఆర్‌కు చిక్కులు తెచ్చేలా ఉంది. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి..కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఏదో భారీ సినిమా విడుదల చేసినట్లు ఆడియో, వీడియోలు ప్రెస్ ముందు ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే అంశం. కొనుగోలు కేసులో ఉన్న నిందితులకు ఊరటనిచ్చేలా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలని నందకుమార్, సింహయాజులు, రామచంద్రభారతి అనే ముగ్గురు వ్యక్తులు..ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్లు ఆఫర్ చేసి..పార్టీ మారేలా ఒత్తిళ్ళు చేసిన విషయం తెలిసిందే.

దీనికి సంబంధించిన ఆడియో, వీడియోలు బయటకొచ్చాయి. ఇక ఎమ్మెల్యేలు, పోలీసులతో కలిసి ఆ ముగ్గురు నిందితులని పకడ్బంధీగా ప్లాన్ చేసి పట్టుకున్నారు. అలాగే వారు అరెస్ట్ కావడం బెయిల్ పై రావడం జరిగాయి. అయితే ముందే ఆడియో, వీడియోలు వచ్చాయని, దీనిలో రాష్ట్ర ప్రభుత్వ కుట్ర ఉందని, తమకు సిట్ విచారణపై నమ్మకం లేదని, కాబట్టి ఈ కేసుని సీబీఐకి ఇవ్వాలని నిందితులు, పలువురు బీజేపీ నేతలు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ని విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్..కేసుని సీబీఐకి ఇస్తూ తీర్పు ఇచ్చింది.

తాజాగా తీర్పుకు సంబంధించిన ఆర్డర్ కాపీ బయటకొచ్చింది..దీనిలో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అసలు ఈ కేసుకు సంబంధించి ఆధారాలు, మెటీరియల్‌.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎలా చేరాయని కోర్టు ప్రశ్నించింది. వీటిని ఎవరు, ఎప్పుడు, ఎలా అందజేశారన్న అంశం ఇప్పటికీ మిస్టరీగానే ఉందని తెలిపింది. ఏ చట్టం ప్రకారం, లేదా ఏ నిబంధనల ప్రకారం ఆధారాలు మొత్తం ముఖ్యమంత్రికి చేరాయో సిట్‌ గానీ, ప్రభుత్వం గానీ వివరించలేదని, ఈ కేసులో ఫిర్యాదుదారైన ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డియే ఆధారాలను సీఎంకు ఇచ్చి ఉండవచ్చు అనే వాదనకు నిరూపణ లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది.

చివరికి జీవో నెంబర్‌ 63 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి ఏకసభ్య ధర్మాసనం కొట్టేసింది. ఇప్పటివరకు రాజేంద్రనగర్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌, సిట్‌ చేసిన దర్యాప్తును రద్దు చేసి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫిర్యాదు ఆధారంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను, అక్టోబరు 26 నాటి అబ్జర్వేషన్‌ పంచనామాను, 27 నాటి మీడియేటర్‌ పంచనామాను సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది. మళ్లీ మొదటి నుంచి కొత్తగా దర్యాప్తు చేయాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలా ఉంటే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున గెలిచి.. బీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపైనా విచారణ చేపట్టాలని సీబీఐని కోరనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. వీరిలో కొందరికి పదవులు రాగా.. మరి కొందరికి ఆర్థికంగా లబ్ధి చేకూరిందని, ఇది కూడా ప్రలోభం కిందకే వస్తుందని, పార్టీ మారినందుకు ఈ 12 మంది ఎమ్మెల్యేలకు ఏం లబ్ధి చేకూరిందన్న వివరాలనూ సీబీఐకి అందజేస్తామని వెల్లడించారు.

మొత్తానికి ఈ కేసుని సీబీఐకి ఇవ్వడంతో కేసీఆర్‌కు షాక్ తగిలినట్లు అయింది. అటు కాంగ్రెస్ సైతం తమ ఎమ్మెల్యేలని కేసీఆర్ లాక్కోవడంపై సీబీఐకి వివరాలు ఇస్తామని అంటుంది. ఇక ఈ కేసులో రాజకీయ కోణం చాలా ఉందని విశ్లేషకులు అంటున్నారు. గతంలో ఓటుకు నోటు కేసు ద్వారా టీడీపీని ఎలా దెబ్బకొట్టారో..అలాగే బీజేపీని దెబ్బకొట్టాలని చూశారని, కానీ వీడియోలు,ఆడియోలు ముందు వేయడంతో సీన్ రివర్స్ అయిందని అంటున్నారు. మరి చూడాలి దీనిపై కేసీఆర్ న్యాయ పోరాటం చేస్తారా? ఈ కేసులో సీబీఐ ఎలా ముందుకెళుతుందనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news