ఎడిట్ నోట్: వనంలో ‘కుల’ రాజకీయం..!

-

పవిత్రమైన కార్తీకమాసాన్ని సైతం..రాజకీయాలకు వేదికగా మార్చుకుని, రాజకీయ ప్రయోజనాలు పొందడమే లక్ష్యంగా రాజకీయ నేతలు ముందుకెళుతున్నారు. కార్తీక మాసం సందర్భంగా వన సమారాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏ కులం వారు ఆ కులానికి సంబంధించి వన సమారాధన కార్యక్రమం చేసుకుంటున్నారు. అయితే వన భోజనాల కార్యక్రమం రాజకీయంగా జరుగుతున్నాయి. ఈ కులాల వారీగా జరుగుతున్న కార్యక్రమంలో..ఆయా కులాలకు చెందిన నాయకులు వచ్చి..తమ తమ పార్టీలకు సంబంధించి డప్పు కొట్టుకోవడం, ప్రత్యర్ధి పార్టీలపై విమర్శలు చేయడం చేస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో వనంలో ఈ కుల రాజకీయం నడుస్తోంది. కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ, గౌడ, యాదవ, పద్మశాలి, మున్నూరు కాపు, వెలమ..ఇలా ప్రతి కులం సైతం..తమ కులానికి సంబంధించి  వన సమారాధన కార్యక్రమం చేస్తున్నారు. అటు తెలంగాణలో, ఇటు ఏపీలో ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి. అయితే ఈ కార్యక్రమలో అన్నీ పార్టీల వారు వస్తున్నారు..కాకపోతే కొన్ని చోట్ల రాజకీయ పరంగా చర్చలు జరగడం లేదు గాని కొన్ని చోట్ల మాత్రం రాజకీయ పరమైన చర్చలు నడుస్తున్నాయి.  తాజాగా గుంటూరులో పద్మశాలిల వన సమారాధన జరిగింది. ఈ కార్యక్రమలో మంగళగిరికి చెందిన వైసీపీ నేత గంజి చిరంజీవి పాల్గొని..నారా లోకేష్‌పై విమర్శలు చేశారు. ఇక అదీ కార్యక్రమంలో టీడీపీకి చెందిన నేత సైతం..గంజిపై విరుచుకుపడ్డారు.

అటు జగ్గయ్యపేటలో కమ్మ వన సమారాధన జరగగా…అదే వర్గానికి చెందిన వైసీపీ నేత వసంత నాగేశ్వరరావు..ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చడంపై ఫైర్ అయ్యారు. జగన్ గెలుపుకు కమ్మ వర్గం కూడా సహకరించిందని, అన్నీ వర్గాలని ఒకేలా చూడాలని, రాష్ట్ర క్యాబినెట్ లో కమ్మ వర్గానికి ప్రాధాన్యత లేదని, పక్కనే ఉన్న తెలంగాణలో కమ్మ వర్గానికి ప్రాధాన్యత ఉందని ఫైర్ అయ్యారు.

ఇటు తెలంగాణలో కోదాడలో వివిధ సామాజిక వర్గాల ఆధ్వ ర్యంలో పట్టణంలో ఏర్పాటుచేసిన సామూహిక వనభోజనాల కార్యక్రమం జరిగింది. దీనికి కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌, మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్‌ పద్మావతి, ఏపీకి చెందిన జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య పాల్గొన్నారు.

ఇక అధికారులు సైతం ఈ కులాల సమారాధనలో పాల్గొని పార్టీలకు భజన చేస్తున్నారు. తాజాగా కొత్తగూడెంలో మున్నూరు కాపు వన కార్యక్రమం జరగగా, దీనికి తెలంగాణ హెల్త్ డైరక్టర్ శ్రీనివాసరావు హాజరయ్యి..ఇటీవల కేసీఆర్ కాళ్ళకు మొక్కిన అంశంపై క్లారిటీ ఇచ్చారు. తనకు కేసీఆర్ పితృ సమానులు అని, ఆయన కాళ్ళకు వందసార్లు మొక్కుతానని అన్నారు..తెలంగాణ జాతిపిత కేసీఆర్ అంటూ మాట్లాడారు. ప్రభుత్వ పదవిలో ఉంటూ ఇలా కేసీఆర్‌కు భజన చేయడంపై శ్రీనివాసరావుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇలా వన సమారాధన కార్యక్రమాల్లో కుల రాజకీయాలు నడుస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version