ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తుంది. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ తమ పని తాము చేసుకుంటూ వెళుతుంటే..పవన్ మాత్రం వైసీపీ టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. వారాహి యాత్రతో జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. ఇదే క్రమంలో వాలంటీర్ల టార్గెట్ గా పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాష్ట్రంలో చాలామంది మహిళలు మిస్ అవుతున్నారని దానికి కారణం వాలంటీర్లే అని పవన్ ఆరోపించారు.
వాలంటీర్లకు ప్రతి కుటుంబం సమాచారం తెలుసని, మహిళలు ఎక్కడ ఉన్నారు..వితంతువులు ఎంతమంది ఉన్నారు ఈ సమాచారం మొత్తం తెలుసుకుని సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. తనకు కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చిందని అన్నారు. ఇక ఇలా పవన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలో వాలంటీర్లు నిరసన తెలియజేస్తున్నారు. పవన్ దిష్టి బొమ్మలని తగలబెడుతున్నారు. అటు వైసీపీ నేతలు సైతం పవన్ టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. దీంతో పోరు మరింత ముదురుతుంది.
అయితే వాలంటీర్లపై పవన్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. జగన్ కావాలని వాలంటీర్ వ్యవస్థని సృష్టించి జనంపైకి వదిలారని, వారి చేతుల్లోనే ప్రజల డేటా మొత్తం ఉందని అంటున్నారు. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ అనవసరం అని, ఉన్న వ్యవస్థలను బలోపేతం చేయకుండా, అవసరంలేని వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారని విమర్శించారు. వ్యక్తిగత సమాచారం సేకరించేందుకు వాలంటీర్లు ఎవరు? అని, వాలంటీర్లు సేకరించిన సమాచారాన్ని ఎక్కడ ఉంచుతున్నారు? అని నిలదీశారు.
కాకపోతే అందరు కాకపోయిన కొందరు వాలంటీర్లపై విమర్శలు ఎక్కువగానే వచ్చాయి. ఎలాగో వారు వైసీపీ కార్యకర్తలే అని ఆ పార్టీ నేతలే చెప్పారు. ఇక కొన్ని చోట్ల మహిళలపై అఘాయిత్యం చేశారని వార్తలు వచ్చాయి. పెన్షన్ డబ్బులతో పారిపోయారని, అలాగే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయకపోతే పథకాలు పోతాయని బెదిరించడం ఇలా పలు ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు పవన్ మహిళలు మిస్ అవుతున్నారని అన్నారు.
అయితే ఇలా పవన్ మాట్లాడటం వెనుక ఏదైనా రాజకీయ కోణం ఉందా? అనేది డౌట్ వస్తుంది. అసలు రాజకీయాల్లో ఎంతో సీనియర్ అయిన చంద్రబాబు సైతం వాలంటీర్ వ్యవస్థని టార్గెట్ చేయడం లేదు. కానీ పవన్ టార్గెట్ చేశారు. ఇక దీనిలో రెండు కోణాలు చెబుతున్నారు. ఒకటి వాలంటీర్లు చేసే పనుల వల్ల వైసీపీకి ప్రజల్లో నెగిటివ్ పెరుగుతుంది…అదే ఫార్ములాతో పవన్ సైతం వాలంటీర్లపై ఆరోపణలు చేశారు.
రెండోది జగన్ ప్రభుత్వంపై కొందరు వాలంటీర్లు వ్యతిరేకంగా ఉన్నారని, ఇప్పుడు పవన్ వారిని టార్గెట్ చేసి..ఆ వ్యతిరేకత పోగొట్టారని, పవన్ వైసీపీకి అనుకూల శత్రువు అనే టాక్ వస్తుంది. చూడాలి మరి చివరికి ఈ అంశం ఎక్కడ వరకు వెళుతుందో.