ఎడిట్ నోట్: స్కామ్‌లు-రాజకీయ కక్ష..!

-

రెండు తెలుగు రాష్ట్రాల్లో స్కామ్‌లు, వివేకా హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. వీటిల్లో ప్రముఖ రాజకీయ నేతల పేర్లు స్కామ్ ల్లో ఉండటం సంచలనం సృష్టిస్తుంది. అదే సమయంలో ఈ స్కామ్‌లు అనేది కేవలం కల్పితం మాత్రమే అని…అధికార పార్టీలు రాజకీయ కక్షతోనే ప్రత్యర్ధులని ఇబ్బంది పెట్టడానికి వేస్తున్న ఎత్తుగడలు అని కూడా అర్ధమవుతుంది.

ముందు వివేకా హత్య గురించి మాట్లాడుకుంటే..ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని సి‌బి‌ఐ పలుమార్లు విచారించింది..అలాగే దాదాపు ఆయన అరెస్ట్ జరిగిపోతుందనే తరుణంలో..కోర్టుకు వెళ్ళి అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. కోర్టు సైతం సోమవారం అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది. మళ్ళీ మంగళవారం సి‌బి‌ఐ విచారణకు హాజరు కావాలని అవినాష్ రెడ్డిని ఆదేశించింది..దీంతో ఆయన అరెస్ట్ జరిగే ఛాన్స్ ఉందని ప్రచారం నడుస్తోంది.

ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ఈడీ విచారణ ఎదుర్కున్న విషయం తెలిసిందే..ఆమె అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది..కానీ అరెస్ట్ జరగలేదు..కాకపోతే మళ్ళీ 16న విచారణకు  రావాలని ఆదేశాలు వచ్చాయి. మరి అప్పుడు ఏం జరుగుతుందో తెలియదు.  అయితే ఇదంతా కేంద్రంలో అధికారంలో ఉన్న బి‌జే‌పి కక్షపూరితంగానే ఇదంతా చేస్తుందని గులాబీ నేతలు అంటున్నారు..కే‌సి‌ఆర్..బి‌జే‌పిని టార్గెట్ చేసుకుని విరుచుకునిపడుతున్నారు. మరి స్కామ్ లో కవిత ఉన్నారా? లేక రాజకీయ కక్ష అనేది క్లారిటీ లేదు.

ఇటు ఏపీ విషయానికొస్తే వైసీపీ ప్రభుత్వం..ప్రతిపక్ష టి‌డి‌పికి చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో చంద్రబాబుని టార్గెట్ చేసి స్కిల్ డెవల్‌పమెంట్‌ స్కామ్ అంటున్నారు..ఇప్పటికే పలువురిని సి‌ఐ‌డి అరెస్ట్ చేసింది..చంద్రబాబుని కూడా త్వరలో జైలుకు వెళ్తారని వైసీపీ నేతలు అంటున్నారు. అసలు 370 కోట్ల ప్రాజెక్టులో 3,300 కోట్ల స్కామ్ జరిగిందని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది..ఇదంతా రాజకీయ కక్షతోనే చేస్తున్నారని టి‌డి‌పి అంటుంది.

నాటి టీడీపీ ప్రభుత్వం 2015లో స్కిల్‌ డెవల్‌పమెంట్‌- సీమెన్స్‌ ప్రాజెక్టును తీసుకొచ్చింది. ఈ ప్రాజెక్టు వ్యయం 3,356 కోట్లు కాగా,  ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 10 శాతం. మిగిలిన 90 శాతం సీమెన్స్‌ కంపెనీ, డిజైన్‌ టెక్‌ భరించేలా ఒప్పందం చేసుకుంది. కానీ దానిలోనే స్కామ్ జరిగిందని వైసీపీ, కాదు అది కక్ష పూరితంగా చేస్తున్నారని, అలాగే వివేకా హత్య కేసుని డైవర్ట్ చేయడానికే ఇదంతా చేస్తున్నారని టి‌డి‌పి అంటుంది.

ఇక మార్గదర్శి కేసు..ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు టార్గెట్ గా వైసీపీ ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తుంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై మోసాలు జరిగాయని చెప్పి ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని పేర్కొంటూ చిట్‌ ఫండ్స్‌ చైర్మన్‌, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు, ఆయన కోడలు, మార్గదర్శి మేనేజింగ్‌ డైరెక్టర్‌ చెరుకూరి శైలజలపై సీఐడీ అధికారులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇక ఇది కూడా కక్ష సాధింపు చర్యే అని ప్రతిపక్షాలు అంటున్నాయి. మొత్తానికి స్కామ్‌లు నిజమో లేక రాజకీయ కక్ష అనేది ప్రజలకు క్లారిటీ రావడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version