రుతు వర్ణన చేయడంలో ఆనందం ఉంది. రుతు వర్ణన చేయడంలో గొప్పనయిన ఆనందంతో పాటు భాషకు సంబంధించి ఔన్నత్య విస్తరణ ఒకటి దాగి ఉంది. రుతువుల రాణి వసంతం అని ఈ మధు మాసం అని ఈ దరహాసం అని ఏవేవో రాయడం ఉటంకించడం కవులు చేస్తున్న పనులు. ఆ పనులకు కొనసాగింపు జీవితం కావాలి అని అనుకోవడమే ఆశ. నిరర్థక ఆశలు కొన్ని తొలగిపోతే జీవితం మరింత సుసంపన్న క్షేత్ర నిర్మాణాలకు ప్రాధాన్యం ఇవ్వగలదు అని నా లాంటి మనలాంటి సామాన్యుల ఆశ.
చిగురాటుకుల చెంత వినిపించే కోయిల స్వరాలకు కొంత తీపి ఉంది కొంత చేదు ఉంది. వినిపించేది అనిపించేది అంతా తీపి అని అనుకోవడంలో భ్రమ ఉంది. ఓ విధంగా మనకు తెలియని అసందిగ్ధతలను తొలగింపు చేసుకోవడంలోనే సమర్థనీయ ధోరణి ఉంది.తెలియని అని అంటున్నాం కానీ అన్నీ తెలిసే ఉంటాయి. కొన్ని యాథార్థంలోనూ కొన్ని మాయా సంబంధిత ప్రక్రియలోనూ తెలిసే ఉంటాయి. మనం తెలియదు అని చెప్పడం తెలియదు అని అనుకోవడం భ్రమ. భ్రమను ఛిద్రం చేస్తే వాస్తవం. వాస్తవాతీత వర్ణనలను చేయడం కవికి తగని పని.
కవి అయినా లేదా సాధారణ మనిషి అయినా సామాన్యం నుంచి ఎదిగి వస్తాడు.సాధారణ అని అంటామే కానీ ఏదీ సాధారణం కాదు. నిత్య జీవితంలో అసాధారణ ధారణ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. పరుగు అసాధారణం అయి ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయి. కానీ మనం గుర్తించక సాధారణ స్థితిలో ఉండి ఏవేవో ఊహిస్తున్నాం. ప్రేమ సాధారణం అయి ఉంటుందా ? అంటే అలాంటి ప్రేమకు మీరు బానిసలుగా ఉన్నారా? అంటే మీరు ఏవో కొన్ని చిత్త కాల ప్రవుత్తులకు బానిసలుగా ఉన్నారా? ఇవి కూడా ఆలోచించాలి. అప్పుడు మాత్రమే కవి సమయాలు జీవన గమనాలు అర్థం అయి ఉంటాయి. కనుక లోపలి ఊహ అసాధారణం కాదన్నా ఔనన్నా ఇదే నిజం.అందరికీ శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు.
– రత్నకిశోర్ శంభుమహంతి
శ్రీకాకుళం దారుల నుంచి…