జగనన్నకు చెబుదాం..ఇది ఏపీలో అధికార వైసీపీ కొత్తగా స్టార్ట్ చేయనున్న కార్యక్రమం. ఇప్పటికే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే..ఇక ఇప్పుడు కొత్తగా రెండు కార్యక్రమాలతో వైసీపీ ముందుకు రానుంది. ఈ నెల 7వ తేదీన ‘జగనన్నే మా నమ్మకం’ పేరిట ఇంటింటికీ స్టిక్కర్లు అతికించే కార్యక్రమం, ఈ నెల 13వ తేదీన ‘జగనన్నకు చెబుదాం’ అనే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. వైసీపీపై సానుభూతి ఉన్నవారు మిస్డ్ కాల్ ఇచ్చే కార్యక్రమం చేపట్టాలని, మనం అధికారంలో లేకపోతే.. కోట్ల మందికి నష్టమని, తాను చేయాల్సింది చేస్తానని, ఎమ్మెల్యేలుగా మీరు చేయాల్సింది మీరు చేస్తే 175 స్థానాలనూ గెలుచుకుంటామని తాజాగా జగన్ వైసీపీ వర్క్ షాపులో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే.
అయితే జగనన్నకు చెబుదాం అనేది రివర్స్ లో కూడా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం ప్రభుత్వ పథకాలు మాత్రమే కాదు..నియోజకవర్గాల్లో అభివృద్ధి కూడా కావాలని, ప్రజా సమస్యలు పరిష్కరించాలని, నిధులు కావాలని చెప్పి ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఆ విషయాన్ని జగనన్నకు చెప్పాలని ఎమ్మెల్యేలు చూస్తున్నారు. బాగా పని చేయడం అంటే పథకాలు మాత్రమే ఇవ్వడమే కాదని, అభివృద్ధి కూడా చేస్తేనే పనిచేసినట్లు అని, దానికి నిధులు కావాలని వైసీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.
అదే సమయంలో జగన్ సైతం ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఉందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఆయన బయటకు రావాలని చెబుదామనే పరిస్తితి ఉంది. అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చాక కొందరు నాయకులే బాగుపడ్డారు తప్ప..ఇప్పటికీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. దీంతో కార్యకర్తలకు అండగా ఉండాల్సిన బాధ్యత ఉంది. ఈ అంశాన్ని కూడా జగనన్నకు చెప్పాల్సి ఉందని అంటున్నారు. అలాగే ఎమ్మెల్యేలని, సాధారణ నాయకులు, కార్యకర్తలని జగన్ కలవాలని, అప్పుడే గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలుస్తుందని చెబుతున్నారు. మొత్తానికి జగనన్నకు చెబుదాం అనేది రివర్స్ లో చెబుతున్నారు.