మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాసేపటి క్రితమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్ ఉద్యమ ద్రోహులకు పట్టం కడుతున్నారని మండిపడ్డారు. జగన్ ఓదార్పు యాత్ర కి మద్దతిచ్చి ఉద్యమ కారులపై రాళ్ల దాడి చేసిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని..ఈటల నిప్పులు చెరిగారు.
హుజూరా బాద్ నియోజక వర్గంలో ఇప్పటి వరకు ఏకంగా రూ. 150 కోట్ల నగదును టీఆర్‌ఎస్ పార్టీ నేతలు పంపిణీ చేశారని ఈటల సంచలన ఆరోపణలు చేశారు. సీఎం కేసీఆర్ ప్రజల్ని కాకుండా పైసలను నమ్ముకున్నాడని మండి పడ్డారు. కేసీఆర్ ఎప్పుడు ఎవరికి పట్టం కడతారో జనం అర్థం చేసుకోవాలని.. కేసీఆర్‌కు హుజురాబాద్ ప్రజల మీద కంటే వారి ఓట్ల పైనే ప్రేమ ఎక్కువ అని చురకలు అంటించారు. గొర్రెలు పంచి… యాదవుల ఓట్లు లాగే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు ఈటల. దళిత బంధు పథకాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.