రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. అది మాజీ మంత్రి ఈటల రాజేందర్…మంత్రి హరీష్‌లని చూస్తే అర్ధమవుతుందని చెప్పొచ్చు. తెలంగాణ రాజకీయాల్లో వీరిద్దరి స్నేహం గురించి అందరికీ తెలుసు. టిఆర్‌ఎస్ పెట్టిన దగ్గర నుంచి ఆ పార్టీ కోసం ఇద్దరు నాయకులు కష్టపడ్డారు. ఉద్యమంలో కూడా ఇద్దరు కలిసికట్టుగా పోరాడారు. కేసిఆర్ ఎంపీగా ఢిల్లీలో ఉంటే, రాష్ట్రంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలుగా రాజకీయాన్ని నడిపించారు.
అలాంటి నాయకులు ఇప్పుడు శత్రువులుగా మారిపోయారు. హుజూరాబాద్ వేదికగా ఈ ఇద్దరు నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఇద్దరు నాయకులు తెలివిగా ఒకరినొకరు చెక్ పెట్టుకోవాలని అనుకుంటున్నారు. గతంలో వీరు ఒకే పార్టీలో ఉండగా జరిగిన అంతర్గత రాజకీయాలని బయటపెట్టుకుంటున్నారు. ఈటల సీఎం పీఠం కోసమే బిజేపిలో చేరారని, అన్నం పెట్టిన కేసిఆర్‌ని మోసం చేశారని హరీష్ మాట్లాడుతున్నారు.
హరీష్ ఇలా మాట్లాడుతుంటే ఈటల ఎందుకు తగ్గుతారు. ఆయన కూడా గతంలో రాజకీయ సందర్భాలని బయటపెడుతున్నారు. 2018 ఎన్నికల్లో హరీష్, తన అనుకూల ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చారని, సీఎం పీఠం కోసం ప్రయత్నించారని, అందుకే కేసిఆర్, హరీష్‌ని దూరం పెట్టారని చెప్పారు. అయితే టిఆర్‌ఎస్ పార్టీకి తాము ఓనర్లమని మాట్లాడకే, కేసిఆర్ భయపడి, హరీష్‌కు మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేస్తున్నారు.
హరీష్ కేవలం రబ్బరు స్టాంపు అని, కేసిఆర్ ఎలా చెబితే అలా ఆడతారని ఈటల విమరిస్తున్నారు. అయితే ఇలా మొన్నటివరకు మిత్రులుగా ఉన్న ఈటల-హరీష్‌లు ఇప్పుడు శత్రువులుగా మరి కత్తులు దూసుకుంటున్నారు. మొత్తానికైతే ఈటల సైతం హరీష్‌కు ఏ మాత్రం తగ్గకుండా ధీటుగా రాజకీయం చేస్తున్నారనే చెప్పొచ్చు.