జీవితకాలం టీఆర్ఎస్‌లోనే ఉండాలని అనుకున్న ఈటల రాజేందర్…ఎలాంటి పరిణామాల మధ్య టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చారో అందరికీ తెలుసు. కేసీఆర్ ఏ విధంగా మంత్రివర్గం నుంచి సైడ్ చేసి బయటకెళ్లెలా చేశారో కూడా తెలిసిందే. అలా టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన ఈటల…అదే టీఆర్ఎస్‌కు హుజూరాబాద్‌లో ఎలా బుద్ధి చెప్పారో కూడా తెలిసిందే. ఇప్పుడు కేసీఆర్‌ని ఎదిరించి గెలిచిన మొనగాడుగా ఈటల నిలబడ్డారు. ఇక తెలంగాణలో కేసీఆర్‌కు ధీటైన నాయకుడుగా ఈటల నిలిచారు.
కేసీఆర్‌కు చెక్ పెట్టి అధికారం దక్కించుకోవాలని చూస్తున్న బీజేపీకి ఒక టార్చ్ బేరర్ మాదిరిగా దొరికారు. అయితే టీఆర్ఎస్‌తో, కేసీఆర్‌తో ఈటలకు ఎలాంటి సన్నిహిత సంబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాదాపు 20 ఏళ్ల స్నేహం. అలాగే కేసీఆర్ రాజకీయం ఎలా ఉంటుందో తెలిసిందే.. అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకునే రాజకీయం..అలాంటప్పుడు కేసీఆర్…మళ్ళీ ఈటలని టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించే పరిస్తితి ఉందని తెలంగాణ రాజకీయాల్లో ప్రచారం నడుస్తోంది. “ఇక అయిందేదో అయింది…మన పార్టీలోకి వచ్చేయ్ రాజేంద్ర” అని కేసీఆర్ అడిగితే… ఈటల రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
తాజాగా ఒక మీడియా ఇంటర్వ్యూలో ఈటల రియాక్షన్ వచ్చేసింది. అసలు టీఆర్ఎస్‌లోకి వెళ్ళే ప్రసక్తే లేదని, చావనైనా చస్తా కానీ.. ఆ పని చేయనని, తాను పదవి కోసం ఆరాటపడేవాణ్ని కాదని ఈటల తేల్చేశారు. కాకపోతే టీఆర్ఎస్‌లోనే రాజకీయ జీవితం మొదలుపెట్టిన తాను…అదే పార్టీలో ముగిద్దామని అనుకున్నానని, కానీ కేసీఆర్ అలా చేయనివ్వలేదని, పార్టీ నుంచి బయటకెళ్లెలా చేశారని చెప్పారు.
ఇక బీజేపీలోనే రాజకీయ జీవితం కొనసాగిస్తానని, తాను లాబీయింగ్, పదే పదే పార్టీలు మారే వాడిని కాదని చెప్పారు. ఇక తన కర్తవ్యం కేసీఆర్ గురించి ప్రజలకు తెలిసేలా చేయడమని, బీజేపీని బలోపేతం చేయడమని చెప్పేశారు. మొత్తానికి చూసుకుంటే ఈటల మళ్ళీ టీఆర్ఎస్‌లో వెళ్ళే ప్రసక్తే లేదని తేలిపోయింది.